దేశంలో నిజమైన రైతు నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది సీఎం కేసీఆరేనని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని మంత్రి పరిశీలించారు. అనంతరం సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని నంగునూరు మండలంలో తహసీల్, మండల ప్రజాపరిషత్ నూతన భవనాలు, నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ రూ.307 కోట్లతో నంగునూరు మండలాన్ని అభివృద్ధి చేసుకున్నామన్నారు. రైతులు అధైర్యపడొద్దు.. అండగా ఉంటామన్నారు. వడగండ్లతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం అందజేస్తామన్నారు. తెలంగాణ వచ్చి..కాళేశ్వరం నీళ్లు రావడంతో రైతులకు మేలు జరిగిందన్నారు. గతంలో ఇందిరమ్మ ఇండ్ల డబ్బుల కోసం పైరవీలు చేసే పరిస్థితి ఉండేదని, నేడు రూపాయి ఖర్చు లేకుండా డబుల్బెడ్రూమ్ ఇండ్లు వస్తున్నాయన్నారు. తెలంగాణ సచివాలయానికి సీఎం కేసీఆర్ అంబేద్కర్ పేరు పెట్టి మన గౌరవాన్ని పెంచారన్నారు.
– సిద్దిపేట/ సిద్దిపేట అర్బన్/ నంగునూరు, మే 3
నారాయణరావుపేట, మే 3: మండలంలోని లక్ష్మీదేవిపల్లి ఎస్సీ కాలనీలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన 50 డబుల్ బెడ్ రూమ్ గృహ ప్రవేశ కార్యక్రమం బుధవారం ఆనందోత్సాహాల నడుమ జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మంత్రికి డప్పు చప్పుళ్లు, మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. లబ్ధిదారులకు మంత్రి కొత్తింటిలోనే పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఎన్ని జన్మలెత్తినా.. మీ రుణం తీర్చుకోలేనిది.. సిద్దిపేట నియోజకవర్గ ప్రజల కోసం ఎంతైనా కష్ట పడతానని అన్నారు. ఒక్క చెమట చుక్క పడకుండా, ఒక్క రుపాయి కూడా ఖర్చు లేకుండా లక్ష్మీదేవిపల్లివాసులకు ఇల్లు వచ్చిందన్నారు.
తెలంగాణ సాధించుకొని, కాళేశ్వరం నిర్మించడంతో ఎన్నో మంచి పనులు జరిగాయని చెప్పారు. తెలంగాణ సెక్రటేరియట్‌కు అంబేద్కర్ పేరు పెట్టి మన గౌరవాన్ని సీఎం కేసీఆర్ పెంచారన్నారు. దేశమే అబ్బురపడేలా హైదరాబాద్‌లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పడం యావత్తు తెలంగాణకు గర్వకారణమన్నారు. సీఎం కేసీఆర్ పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని కొనియాడారు. గ్రామంలోని విలేజ్ ఫంక్షన్ హాల్‌కు మరమ్మతులు చేయిస్తామని, దరఖాస్తు చేసుకున్న మరికొంత మంది అర్హులకు త్వరలోనే ఇండ్లు మంజూరు చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజారాధాకృష్ణశర్మ, ఎంపీపీలు బాలకృష్ణ, మాణిక్యరెడ్డి, వైస్ ఎంపీపీ సంతోష్, గ్రామ సర్పంచ్ మంజులాశ్రీనివాస్, ఎంపీటీసీ దండు స్వప్నాప్రభాకర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎల్లయ్య, పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు ఎల్లం, నాయకులు కిషన్, భిక్షపతి పాల్గొన్నారు.
సిద్దిపేట, మే 3 : తడిసిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్వయానా సీఎం కేసీఆరే చెప్పారని, రైతులు ఆందోళన చెందవద్దని రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు రైతులకు భరోసా ఇచ్చారు. జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్ని మంత్రి, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, సివిల్ సైప్లె అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని కాపాడుతూ, రైతుల కష్టాల్లో పాలు పంచుకుంటుదన్నారు. ఈ సందర్భంగా యార్డులో పలువురు మహిళలు మంత్రితో మాట్లాడుతూ.. రాళ్లవానతో పండిన పంటంతా రాలిపోయిందని, మార్కెట్‌కు తెచ్చిన ధాన్యం కూడా వానకు తడిసిపోయిందని ఆవేదన వెలిబుచ్చారు. దీంతో మంత్రి మీ బాధలు తెలుసుకునేందుకే తాను వచ్చానని, ఆందోళన చెందవద్దని, సీఎం కేసీఆర్ మీకు అండగా ఉన్నారని మహిళా రైతులను ఓదార్చారు. మంత్రి వెంట ఏఎంసీ చైర్పర్సన్ మచ్చ విజితావేణుగోపాల్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ నరేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఉన్నారు.