సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 18: వేసవిలో పిల్లలు సరైన మార్గంలో నడవాలనే ఉద్దేశంతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘భద్రంగా ఉండాలి.. భవిష్యత్‌లో ఎదగాలి’ అనే నినాదంతో శనివారం సిద్దిపేటలోని మెట్రో గార్డెన్లో పాఠశాల స్థాయి విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. వేసవిలో ఈతకు వెళ్లవద్దు, బైక్‌లు నడపవద్దు, ఆన్లైన్ గేమ్‌లకు దూరంగా ఉండాలి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి, ప్రాథమిక జీవన నైపుణ్యాలు తదితర విషయాలను పిల్లలకు నేర్పించాలనే ఉద్దేశంతో ఈ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు.
చదువుతో పాటు క్రమశిక్షణ, సమయపాలన, చక్కటి దినచర్య, మంచి ఆహారం, యోగా, వ్యాయామం, కంప్యూటర్ కోచింగ్, ఇంగ్లిష్, ఇతర భాషలపై శిక్షణ, పుస్తకాలు చదవడం వంటి విషయాలపై విద్యార్థులకు ఆసక్తిపెంచాలని తల్లిదండ్రులకు సూచించారు. సిద్దిపేట నియోజకవర్గాన్ని తన కుటుంబంగా భావిస్తానని, తన పిల్లల బాగోగులు చూసుకోవడానికి తనవంతుగా ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.