సిద్దిపేట, ఆగస్టు 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట జిల్లా గజ్వేల్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు రోజురోజుకు ముదురుతున్నది. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరింది.రెండు వర్గాల నేతలు ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలకు దిగడంతో పాటు కేసులు పెట్టుకుంటున్నారు. దిష్టిబొమ్మల దహనం సైతం చేసుకుంటున్నారు. తూంకుంట నర్సారెడ్డిపై ఇప్పటికే రెండు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి.
మరోవైపు తూంకుంట నర్సారెడ్డి వర్గీయులు మైనంపల్లి హన్మంతరావు దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసనను తెలియజేస్తున్నారు. ఇలా రెండు వర్గాలు తగ్గేది లేదన్నట్టుగా ముందుకు సాగుతున్నారు. దీంతో గజ్వేల్ కాంగ్రెస్ రెండు ముక్కలైంది. ఎవరికి వారే తమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒకే వేదిక మీదికి రెండు వర్గాలు చేరితే అక్కడ ఇక రచ్చరచ్చ అనే తీరుగా నడుస్తోంది. ఇటీవల కాంగ్రెస్ ఎస్సీ సెల్ నేత విజయ్ కుమార్‌పై దాడితో గజ్వేల్ కాంగ్రెస్‌లో విబేధాలు తారాస్థాయికి చేరాయి.
రెండు వర్గాలుగా విడిపోయిన పార్టీ…
గజ్వేల్ కాంగ్రెస్‌లో గతంలో డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంత్‌రావు వర్గాలు ఉండేవి. ఈ రెండు వర్గాలు ఎవరికి వారు తమ పార్టీ కార్యక్రమాలు నిర్వహించేవి. ఇలా కొన్నాండ్లు సాగింది. నామినేటెడ్ పదవుల విషయంతో శ్రీకాంత్‌రావు, నర్సారెడ్డి వర్గాల మధ్య పోటాపోటీ కొనసాగింది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకున్నారు. అధిష్టానం ఇరువర్గాలను పిలిచి మాట్లాడింది. దీంతో శ్రీకాంత్‌రావు కొంత సైలెంట్ కావడంతో ఆయన వర్గం అంతా మైనంపల్లి వైపు మళ్లింది.
గజ్వేల్ నియోజకవర్గంలో రెండు గ్రూపులుగా కాంగ్రెస్ పార్టీ విడిపోయింది. మైనంపల్లి హన్మంత్‌రావు, తూంకుంట నర్సారెడ్డి వర్గాలుగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చీలిపోయారు. ఒకవర్గం గజ్వేల్‌లో మైనంపల్లి పెత్తనం ఏంటి అని మీడియా సమావేశం ఏర్పాటు చేసి బాహాటంగానే విమర్శలు చేస్తున్నది. ఇదే క్రమంలో కొంతమంది కాంగ్రెస్ పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరిపోయారు. ఈనెల 3న రేషన్ కార్డుల ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్‌పై తూంకుంట నర్సారెడ్డి దాడి చేయడంతో గజ్వేల్ పోలీసులు ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసును నమోదు చేశారు.
అదే రోజు జగదేవ్‌పూర్ మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమానికి మంత్రి వివేక్‌ను కలిసేందుకు వచ్చిన కార్యకర్తను తూంకుంట నర్సారెడ్డి నెట్టి వేయడంతో అక్కడా ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆగస్టు 15న సిద్దిపేటలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం వద్ద తూంకుంట నర్సారెడ్డికి గట్టి షాక్ తగిలింది. దళిత సంఘాల నాయకులు నర్సారెడ్డి కారును అడ్డుకుని ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సిద్దిపేట పట్టణంలో ర్యాలీ నిర్వహించి దిష్టిబొమ్మ సైతం దహనం చేశారు.
తూంకుంట నర్సారెడ్డిని అడ్డుకోవడానికి వెళ్లిన మహిళలను కులం పేరుతో దూషించాడని సిద్దిపేట త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో పుట్ట అనసూయ ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడ నర్సారెడ్డిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. వారం రోజుల వ్యవధిలోనే తూంకుంట నర్సారెడ్డిపై గజ్వేల్, సిద్దిపేటలో రెండు కేసులు నమోదయ్యాయి. కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్‌పై దాడి జరిగిన నాటి నుంచి దళిత సంఘాలు నిత్యం నిరసనలు కార్యక్రమాలు చేపడుతున్నాయి.
మైనంపల్లిపై అగ్గిమీద గుగ్గిలం..
తన వ్యక్తిగత అవసరాల కోసం పూటకో పార్టీ మార్చే మైనంపల్లి హన్మంత్‌రావు కుల రాజకీయాలు మానుకోవాలని తూంకుంట నర్సారెడ్డి వర్గీయులు హెచ్చరిస్తూ ఇటీవల వెలికట్ట చౌరస్తా వద్ద మైనంపల్లి దిష్టిబొమ్మను దహనం చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలో వలస నాయకుల పెత్తనం ఏంటి, ఇక్కడ వారికి ఏం పని అంటూ నిలదీశారు. నియోజకవర్గంతో ఎలాంటి సంబంధం లేకపోయినా కొంతమందిని కోవర్టులుగా పెట్టుకొని అశాంతిని నెలకొల్పుతున్నాడని మైనంపల్లిపై నర్సారెడ్డి వర్గీయులు మండి పడుతున్నారు.
గజ్వేల్ కాంగ్రెస్‌లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుండడంతో విసుగు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇతర పార్టీల్లో చేరుతున్నారు. దీంతో నియోజకవర్గంలో పార్టీ బలహీనపడుతున్నది. ప్రభుత్వ పథకాల అమలులో భారీగా అవినీతి చోటు చేసుకుంటున్నట్లు, డబ్బులు ఇవ్వనిదే పనులు కావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందిరమ్మ ఇల్లు, కల్యాణ లక్ష్మి, రేషన్ కార్డు, ఏ పని కావాలన్నా డబ్బులు ఇస్తేనే అవుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో క్యాడర్లో అసంతృప్తి నెలకొంది. పార్టీలో భవిష్యత్తు లేదని కొందరు కాంగ్రెస్ నేతుల, కార్యకర్తలు పార్టీని వీడుతుండడంతో సెగ్మెంట్లో పార్టీ పరిస్థితి ‘హస్త’వ్యస్తంగా మారింది