పటాన్చెరు టౌన్, ఏప్రిల్ 25: సంగారెడ్డ జిల్లా పటాన్‌చెరులోని పారిశ్రామికవాడల్లోని పరిశ్రమలకు కార్మికుల కొరత ఏర్పడింది. దాదాపు యాబై శాతం మంది కార్మికులు తగ్గిపోయారు. పరిశ్రమల్లో ఎక్కువగా పశ్చిమ బెంగాల్, బీహారు రాష్ర్టాలకు చెందినవారు దినసరి కూలీలుగా పని చేస్తుంటారు. పటాన్చెరు నియోజకవర్గంలోని పటాన్చెరు, పాశమైలారం, రామచంద్రాపురం, బొల్లారం, గడ్డపోతారం, ఖాజీపల్లి, బొంతపల్లి, దోమడుగు తదితర పారిశ్రామిక వాడల్లో పని చేసే కార్మికులు ఎక్కువగా పశ్చిమ బెంగాల్, బీహారు, యూపీ రాష్ర్టాలకు చెందినవారే అధికంగా ఉంటారు.
పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు కారణంగా ఆ రాష్ట్ర కార్మికులు వెళ్లిపోయారు. బీహారు రాష్ర్టానికి చెందిన కార్మికులు ప్రతి ఎండా కాలంలో రెండు నెలలు సొంత రాష్ర్టానికి వెళ్తుంటారు. ఇటీవల ఏర్పడిన గ్యాస్ కొరత కారణంగా చిన్న సిలిండర్లకు గ్యాస్ ఫిల్లింగ్ కార్మికులకు కష్టంగా మారింది. ఒకవేళ లభించినా ఎక్కువ రేటు తీసుకుంటుండడంతో కార్మికులు సొంత రాష్ర్టాలకు వెళ్లిపోయారు. ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు పెరగడంతో ఇటీవల పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో భయంతో కొంత మంది కార్మికులు ఇంటిదారి పట్టారు. దీంతో ఒక్కసారిగా పరిశ్రమలకు తీవ్రమైన కార్మికుల కొరత ఏర్పడింది. సగం మంది కార్మికులతోనే పరిశ్రమలను యాజమాన్యాలు నడిపిస్తున్నాయి. ఏ పరిశ్రమ గేటుకు చూసినా వాంటెడ్ కార్మికులు అనే బోర్డులు కనిపిస్తున్నాయి.
పటాన్చెరు నియోజకవర్గంలో లక్ష మంది కార్మికులు
పటాన్చెరు నియోజకవర్గం వ్యాప్తంగా సుమారు లక్ష మంది దినసరి కూలీలుగా, ముప్పై వేల మంది పర్మినెంట్ కార్మికులుగా పరిశ్రమల్లో పనిచేస్తున్నట్లు అధికారిక అంచనా. ఈ ఎండాకాలంలో దాదాపు సగం మంది దినసరి కార్మికులు వివిధ కారణాలతో వారి సొంతూళ్లకు వెళ్లిపోవడంతో పరిశ్రమలకు తీవ్రమైన కార్మికుల కొరత ఏర్పడింది. వానాకాలం, చలికాలంలో పరిశ్రమలకు కార్మికుల కొరత ఉండనప్పటికీ, ఎండాకాలం మాత్రం తీవ్రమైన కార్మికుల కొరత ఏర్పడుతున్నట్లు పరిశ్రమల యాజమాన్యాలు చెబుతున్నాయి. దీంతో లేబర్ కాంట్రాక్టర్లపై ఒత్తిడి పెంచుతున్నాయి. పారిశ్రామిక వాడల్లో ఎక్కడ చూసినా వాంటెడ్ హెల్పర్స్ అంటూ అంటించిన పేపర్లు కనిపిస్తున్నాయి. పరిశ్రమల గేట్లకు ఇవే బోర్డులు. ఎవరైన పని కోసం ఫోన్ చేస్తే దేవుడు ప్రత్యక్షమైనంత సంతోషంతో అవసరమైన సౌకర్యాలు కల్పించి ఉద్యోగంలోకి తీసుకుంటున్నారు.
ఉత్పత్తిపై ఎఫెక్ట్
కార్మికుల కొరత కారణంగా ఉత్పత్తిపై ఎఫెక్ట్ పడుతోందని పరిశ్రమల ప్రతినిధులు చెబుతున్నారు. తీసుకున్న ఆర్డర్లను నిర్ణీత సమయంలోపు అందించలేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. లేబర్‌ను పెంచాలని కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెస్తున్నారు. కొత్త లేబర్ ఒక్కరొస్తే ఇద్దరు పాత వారు వెళ్లిపోతున్నారు. ఈ ఎండాకాలం మొత్తం ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని, దీనిని ఏవిధంగా అధిగమించాలో సమాలోచనలు చేస్తున్నామని ఓ పరిశ్రమ యజమాని తెలిపారు.
సగం మంది కార్మికులు తగ్గారు
బొల్లారం పారిశ్రామిక వాడలో 26వేల మంది కార్మికులు పనిచేసేవారు. ప్రస్తుతం 12 వేల నుంచి 13వేల మంది వరకు మాత్ర మే పనిచేస్తున్నారు. కార్మికుల కొర త కారణంగా పరిశ్రమ ఉత్పత్తులపై ప్రభావం పడుతున్నది. కార్మికుల కొరతకు పశ్చిమ బెంగాల్ ఎన్నికలు ఒక కారణమైతే, ప్రతి వేసవి కాలంలో బీహారుకు చెందిన కార్మికులు రెండు నెలలు వారి సొంత ఊర్లకు వెళ్లడం మరో కారణం.
– ఆనంద్‌రావు, ఐడీఏ బొల్లారం పారిశ్రామికవాడ అధ్యక్షుడు