నిజాంపేట,జూలై11: నీటి నిల్వతోనే వ్యాధులు వ్యాప్తి చెందుతాయని మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్ అన్నారు.శుక్రవారం మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని రాంపూర్,నగరం గ్రామాల్లో నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించడంతో పాటు డ్రైడే ఫ్రైడేలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. వర్షాకాలం నేపథ్యంలో టైర్లు,పూలకుండీలు,ప్లాస్టిక్ బాటిళ్లలో నిల్వఉన్న నీళ్లను తొలిగించాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని,వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
మెదక్ జిల్లా వ్యాప్తంగా తొమ్మిది వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా ఐదువేల మంది లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించారని, పనుల్లో వేగం పెంచాలన్నారు. పరిసరాల శుభ్రతలో పారిశుధ్య కార్మికుల పాత్ర కీలకమని,వారు అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాజిరెడ్డి,ఎంపీవో ప్రవీణ్,పంచాయతీ కార్యదర్శులు ఆరిఫ్హుస్సేన్, రాము, చంద్రహాస్, ఆశవర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు,నాయకులు రవినాయక్, దేవేందర్‌నాయక్, బాబూనాయక్ పాల్గొన్నారు.
రామాయంపేట, జూలై 11: మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడాలేని డెంగీ రామాయంపేటలోనే ఎందుకు ప్రబలిందని పురపాలక సిబ్బందిపై మెదక్ కలెక్టర్ రాహుల్‌రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.శుక్రవారం డ్రైడే ఫ్రైడే సందర్భంగా మెదక్ జిల్లా రామాయంపేటకు వచ్చిన ఆయన మెదక్ జిల్లా వైద్యాధికారి శ్రీరామ్‌తో కలిసి పురపాలిక ఏడో వార్డులో గొల్పర్తి గ్రామాన్ని క్షేత్రస్థాయిలో సందర్శించి పరిసరాలను పరిశీలించి సిబ్బందిపై అసహనం వ్యక్తం చేశారు. నిల్వ ఉన్న నీటిని సిబ్బంది చేత తొలగించారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మున్సిపాలిటీలో పారిశుధ్య పరిస్థితులను మెరుగుపర్చాలన్నారు.
సీజనల్ వ్యాధులు మళ్లీరాకుండా కట్టడి చేయాలన్నారు.ప్రతి శుక్రవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించే విధంగా జిల్లా వైద్యాధికారి చర్యలు చేపట్టాలన్నారు. మురుగు కాల్వలు, నీటి నిల్వ ఉన్న ప్రాంతాలను గుర్తించి దోమల నిర్మూలన కోసం ఆయిల్స్బాల్స్, ఫాగింగ్ యంత్రా లు వాడాలన్నారు. దోమల ద్వారా వచ్చే వ్యాధులపట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అందుకోసం ప్రతి శుక్రవారం డ్రైడే ఫ్రైడే నిర్వహించాలన్నారు. మెదక్ కలెక్టర్ వెంట మేనేజర్ రఘువరన్, వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, కాలేరు ప్రసాద్, శ్రీధర్‌రెడ్డి, పద్మ, శ్రీనివాస్, సైదయ్య ఉన్నారు.