సిద్దిపేట, ఏప్రిల్ 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు ముందుకు కదలడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాట ప్రకటనలు తప్పా లబ్ధిదారులకు చేయూత ఇచ్చేదిగా ఈ స్కీం లేదు. ప్రభుత్వ మాటలకు చేతలకు పొంతన లేకుండా పోతున్నది. ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలిస్తే ఇదే అవగతమవుతున్నది.
ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని ఆశపడి ఉన్న ఇంటిని కూలగొట్టుకున్న లబ్ధిదారుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. ఇటు ఉన్న ఇల్లు పోయింది.. అటు ప్రభుత్వం నుంచి సహకారం లేక ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ప్రతి మండలం నుంచి ఒక్క గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసింది. పైలెట్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో పురోగతి లేదు. లబ్ధిదారులు బేస్మెంట్ వరకు పనులు పూర్తి చేసినా ఇప్పటి వరకు పైసా బిల్లులు రాకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు.
సిద్దిపేట జిల్లాలో 2667 మంది, మెదక్ జిల్లాలో 1242 మంది, సంగారెడ్డి జిల్లాలో 3939 మంది లబ్ధ్దిదారులకు ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వీరందరికీ మంజూరు పత్రాలు ఇచ్చి దాదాపుగా రెండు నెలలు దాటుతున్నది. ఇప్పటి వరకు మెజార్టీ లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలను ప్రారంభించలేదు. ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడంతోనే తాము ఇంటి నిర్మాణాలు ప్రారంభించడం లేదని లబ్ధిదారులు చెబుతున్నారు. అధికారులు చెప్పిన లెక్కల ప్రకారం ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 7848 ఇండ్లు మంజూరయ్యాయి. ప్రతి మండలం నుంచి ఒక్క గ్రామాన్ని పైలెట్‌గా ఎంపిక చేసి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
సిద్దిపేట జిల్లాలో 26మండలాల్లో ఒక్కో గ్రామం చొప్పున 26 పైలెట్ ప్రాజెక్టు గ్రామాలుగా తీసుకుంది. ఇప్పటి వరకు ఈ జిల్లాలో 540 మంది లబ్ధిదారులు మాత్రమే ముగ్గులు పోసినట్లు సమాచారం. వీటిలో 80 గృహాల వరకు బెస్మెంట్ లెవల్లో ఉన్నాయి. మిగతావి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లుగా ఉంది. జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లకు 2,30,483 దరఖాస్తులు వచ్చాయి. వీటిని క్షేత్రస్థాయిలో పరిశీలన చేయగా సొంతింటి స్థలం ఉండి పక్కా ఇల్లు లేని వారు 76,337 మంది ఉన్నారు. అసలే ఇంటి స్థలం లేని వారు 34,404 మంది, అనర్హులుగా 1,19,742 మందిని గుర్తించారు.
మెదక్ జిల్లాలో 1242 ఇండ్లను 21 పైలెట్ గ్రామాల్లో ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటి వరకు 215 ఇండ్ల పనులు మాత్రమే ప్రారంభించారు. ప్రారంభించిన వాటిలో 50 ఇండ్లు బేస్మెంట్ లెవల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక్క లబ్ధిదారుడికి బిల్లు రాలేదు.
సంగారెడ్డి జిల్లాలో మొత్తం లబ్ధ్దిదారులు 3,339 మంది కాగా, నిర్మించడానికి సిద్ధంగా ఉన్న 1231 మందికి ఇండ్లు మంజూరు చేశారు. వీరిలో 350 ఇండ్ల పని ప్రారంభించారు. 25 మండలాల్లో బేస్మెంట్ లెవల్లో 60 ఇండ్ల పనులు జరిగాయి. జిల్లాలో మిగతావి పురోగతిలో లేవు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3500ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పింది. కానీ, ప్రస్తుతానికి ఒక్క పైలెట్ గ్రామాలకే ఇండ్లను మంజూరు చేసి చేతులు దులుపుకొంది. పైలెట్ గ్రామాల్లోనూ పురోగతి లేదు. చాలా ఇండ్లకు బిల్లులు రాక బేస్మెంట్ వరకు పనులు ఆగిపోయాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో 10శాసనసభా స్థానాలు ఉన్నాయి. వీటితో పాటు హుస్నాబాద్, జనగామ, మానకొండూరు నియోజకవర్గాల మండలాలు ఉ న్నాయి. ఈ లెక్కన ప్రభుత్వం చెప్పిన విధంగా ఒక్కో నియోజకవర్గానికి 3500 చొప్పున దాదాపు 40వేల ఇండ్లు మంజూ రు కావాలి. కానీ, కేవలం ఉమ్మడి మెదక్‌కు జిల్లాకు 7848 ఇండ్లు ప్రభుత్వం మంజూరు చేసింది. దీంతో దరఖాస్తుదారుల్లో నిరుత్సాహం అలుముకుంది.