గుమ్మడిదల, మే 3: పేదలకు సొంతింటి కల కలగానే మిగిలి పోతున్నది. అర్హులకు కాకుండా అధికార పార్టీ వారికే ఇందిరమ్మ ఇండ్లు మంజూరైనట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని మండలంలోని వీరన్నగూడెంలో ఇందిరమ్మ ఇం డ్లను మంజూరు చేశారు. కానీ, ఇంటి నిర్మాణాలు బేస్మెంట్ లెవల్లోనే ఉన్నాయి. 40-60 గజాల స్థలంలోనే ఇల్లు కట్టుకోవాలి.. ఆ ఇంటికి మెట్లు ఉండొద్దు.. రెండు గదులే ఉండాలి అనే నిబంధనలు విధించడంతో లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుమ్మడిదల మండలంలోని వీరన్నగూడెంలో జనవరి 26న గ్రామసభ ఏర్పాటు చేశారు.
ఇండ్లకు పలు దరఖాస్తులు రాగా, కేవలం 19 మందికి మాత్రమే ఇండ్లు మంజూరు చేశారు. మిగిలిన వారికి రెండో విడతలో వస్తాయని అధికారులు తెలిపారు. తొలుత మంజూరైన వారిలో 4 మాత్రమే ఇంటి నిర్మాణాలు చేస్తున్నారు. ఇందులో లబ్ధిదారు గాదే సుప్రియ, మరో ముగ్గురు ఇంటి నిర్మాణాలు చేపట్టారు. ఈ లబ్ధిదారులు అప్పులు చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు. వీరికి బిల్లులు రాక పోవడంతో ఎదురు చూస్తున్నారు. చేసిన అప్పులకు మిత్తీలు పెరిగిపోతుండడంతో బిల్లులకు మోక్షం ఎప్పుడు కలుగుతోందోనని వారు ఎదురుచూస్తున్నా రు.
ఈ గ్రామంలో పూరిగుడిసెలో ఉంటున్న పొన్నబోయిన మంజుల ఇందిరమ్మ ఇంటికోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నది. పూరిగుడిసెలో బతుకుతున్న తనకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని, అధికారులను అడిగితే రెండో విడతలో వస్తదని చెబుతున్నారని, తనలాంటి వారికి సర్కారు సాయం అందిస్తే బాగుంటుందని మంజుల ఆవేదన వ్యక్తం చేస్తుంది.
నర్సాపూర్, మే 3: పూరిగుడిసెలో బతకలేక పోతున్నామని, తమకు గూడును కట్టించాలని పేద కుటుంబం ప్రభుత్వాన్ని వేడుకుంటున్నది. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన ఆశిలి యాదమ్మ కొన్నేండ్లుగా ఇల్లు లేక పూరిగుడిసెలో జీవిస్తున్నది. ఆమె భర్త ఆశిలి నాగరాజు చేసే కూలి పనికి వచ్చే ఆదాయంతో ఇల్లు కట్టుకోలేని దుస్థితిలో ఉన్నారు. ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇంటికి దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఇల్లు మంజూరైనట్టు ఏ అధికారి తమకు చెప్పడం లేదని వాపోయారు. అధికారులు ఇంటికి వచ్చి ఫొటోలు తీసుకొన్నారే తప్ప ఇల్లు మంజూరు మాత్రం కావడం లేదన్నారు. వర్షం పడితే గుడిసంతా ఊరుస్తున్నదని, ముగ్గురు పిల్లలతో గడపడం నరకంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
రామాయంపేట, మే 3: మాకు ఇండ్లిస్తమని కాంగ్రెసోల్లు ఆశ పెట్టి ఓట్లేసుకున్నరు. ఇప్పుడేమో మీకు రెండోవిడత వస్తది ఇల్లు అని చెప్తున్నరు. మాకు ఇల్లు లేక కూలిపోయే గుడిసెలోనే ఉంటున్నం. నా భర్తకు పక్షవాతం వచ్చి లేచి నడుస్తలేడు. కనీసం ఇల్లు అయినా మంజూరైతదనుకుంటే అదికూడా ఈ ప్రభుత్వం మంజూరు చేస్తలేదు. వానొస్తే మేము పండుకోవాలంటే చానా ఇబ్బంది ఉంది. ఇల్లు మంజూరు చేస్తే అప్పుచేసి అయినా కట్టుకుంటం.
-కుందెన పద్మ-మల్లేశం, రామాయంపేట