‘కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది… తాము చెప్పిందే వేదం.. అధికారులు నామ్కే వాస్తేగా సర్వేలు చేస్తారు.. ఆ సర్వేలు అన్నీ వట్టివే.. తాము ఎవ్వరి పేరు చెబితే అదే పేరు జాబితాలో వస్తుంది. ఇల్లు కావాలంటే ముందు డబ్బులు ఇవ్వాలి.. మంజూరైన తర్వాత బిల్లులు వచ్చిన కొద్ది ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం డబ్బులు ఇవ్వాలి’.. అని గ్రామాలు, పట్టణాల్లో దళారుల దందా సాగిస్తున్నారు. ఒక్కో ఇంటికి రూ. 50 వేల వరకు దళారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది.
సిద్దిపేట, మే 3(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఇందిరమ్మ ఇంటికి దళారుల డబ్బులు డిమాండ్ చేస్తుండడంతో చాలాచోట్ల ప్రజలు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు. గ్రామా ల్లో అధికారులను నిలదీస్తున్నారు. మండల, జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఆ ఫిర్యాదులు బుట్టదాఖలే అవుతున్నాయి. సర్వేకు వచ్చే అధికారులు కాంగ్రెస్ నాయకులను వెంటబెట్టుకొని రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దీనిపై లబ్ధిదారులు మండిపడుతున్నారు. ఇటీవల సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వంగపల్లికి చెందిన దివ్యాంగుడు బీఆర్ఎస్ మీటింగ్కు వెళ్లాడని అతని ఇందిరమ్మ ఇంటిని రద్దు చేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని ముండ్రాయిలో జాబితాలో పేర్లు రావడంతో పాత ఇండ్లు కూలగొట్టారు కొందరు. ఇప్పుడు అధికారులు విచారణ పేరిట అధికారులు కాలయాపన చేస్తుండడంతో వారంతా ఆందోళనకు గురవుతున్నారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 7945 ఇండ్లు మాత్రమే మంజూరయ్యాయి.
బేస్మెంట్ లెవల్ వరకు కట్టిన 263 ఇండ్లకు మాత్రమే బిల్లులు ఇచ్చారు. మిగతా చాలామంది బేస్మెంట్ వరకు పనులు చేసి బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. మరికొంత మంది ఇల్లు మంజూరైందని తెలిసి ముగ్గులు పోసి సిద్ధం ఇంటి నిర్మాణానికి సిద్ధం కాగా పనులు ఆపారు. ఇల్లు వచ్చింది కదా అని ఉన్న ఇంటిని కూలగొట్టుకొని గుడారం వేసుకొని చాలామంది జీవిస్తున్నారు. లబ్ధ్దిదారుల పరిస్థితి రెంటికి రెడ్డ రేవడిలా తయారైంది. ఇటు ఉన్న ఇల్లు పోయింది.. అటు ప్రభుత్వం నుంచి సహకారం లేదని వారు ఆందోళన చెందుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది. కానీ, ఆచరణలో అది అమలు కావడం లేదు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 శాసనసభా స్థానాలు ఉన్నాయి. వీటితో పాటు హుస్నాబాద్, జనగామ, మానకొండూరు నియోజకవర్గాల మండలాలు ఉన్నాయి. ఈ లెక్కన ప్రభుత్వం చెప్పిన విధంగా ఒక్కో నియోజకవర్గానికి 3500 ఇండ్ల లెక్క చొప్పున దాదాపుగా 40 వేలు మంజూరు కావాలి. ఇందిరమ్మ ఇండ్లకోసం ఉమ్మడి మెదక్ జిల్లాలో పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు.
సిద్దిపేట జిల్లాలో 2667 ఇండ్లు మంజూరయ్యాయి. 665 ఇండ్లకు ముగ్గుపోశారు. 254 ఇండ్లు బేస్మెంట్ లెవల్ పూర్తి చేశారు. 135 ఇండ్లకు బేస్మెంట్ బిల్లులు చెల్లించారు.
మెదక్ జిల్లాలో 1339 ఇండ్లు మంజూరు చేశారు. 320 ఇండ్లు గ్రౌండింగ్ అయ్యాయి. 80 ఇండ్లు బేస్మెంట్ లెవల్ పూర్తి కాగా, 47 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి ఇటీవల రూ లక్ష చొప్పున బిల్లులు ఇచ్చారు.
సంగారెడ్డి జిల్లాలో 3939 ఇండ్లు మంజూరు కాగా, 387 ఇండ్లు గ్రౌండింగ్ అయ్యాయి. బేస్మెంట్ లెవల్లో 118 ఇండ్లు ఉన్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో 81 ఇండ్లకు బేస్ మెంట్ బిల్లులు ఇచ్చారు. కొంత మందికి మాత్రమే బేస్మెంట్ బిల్లులు ఇచ్చారు. ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు ఆర్థిక సాయం అందిస్తున్నది. ఈ డబ్బులు నాలుగు విడతల్లో అందిస్తున్నది.
ఇందిరమ్మ ఇండ్ల కోసం గ్రామాలు, మున్సిపాలిటీల్లో చేసిన సర్వేలు అంతామాయ అని చెప్పాలి. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పడంతో ఆశపడ్డ గూడులేని నిరు పేదలు పెద్దఎత్తున దరఖాస్తు చేసుకున్నారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో లక్షల్లో దరఖాస్తులు వచ్చాయి. వీటిని ఆరు విడుతలుగా సర్వేచేశారు. చివరకు ఇందిరమ్మ కమిటీలను వేసి గ్రామసభలో సెలక్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ గ్రామ సభలో కూడా నిరుపేదలకు మొండిచెయ్యి చూపారు.
అందులో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అనుకూలురకే చోటు కల్పించారు. అర్హులను పక్కన పెట్టేశారు. పైగా అధికారుల విచారణకు వెళ్లినప్పుడు కాంగ్రెస్ నేతలను వెంట పెట్టుకొని పోయారు. వారు చెప్పిన వారి పేర్లను అధికారుల ఫైనల్ చేసినట్లు ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈ క్రమంలో దళారులు భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్త నిబంధనతో పరేషాన్లో లబ్ధ్దిదారులు ఏవేవో సాకులు చెప్పి పూర్తిగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు సంఖ్యను తగించాలని ప్రభుత్వం చూస్తున్నట్లు కనిపిస్తున్నది.
ఇందిరమ్మ ఇంటి వైశాల్యం 600 చదరపు అడుగుల్లోపు ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. పైగా ప్రభుత్వం విధించిన నిబంధనల మధ్యన లేకపోతే వెంటనే ఆ ఇంటి నిర్మాణాలను రద్దు చేయాలని అధికారులకు సంబంధిత మంత్రి వీసీలో ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం.ప్రభుత్వం పెట్టిన నిబంధనలకు ఇంటి నిర్మాణాలు జరగడం కష్టమే.ఇచ్చేది ఏదో సక్కగా ఇయ్యక ఇన్ని కొర్రీలు ఏంటి అని ప్రభుత్వ తీరుపై లబ్ధ్దిదారులు మండిపడుతున్నారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇప్పటి వరకు సిద్దిపేట జిల్లాలో 2667 ఇండ్లు, మెదక్ జిల్లాలో 1,339, సంగారెడ్డి జిల్లాలో 3,939 ఇండ్లు మంజూరు చేశారు. ఉమ్మడి జిల్లాలో బేస్మెంట్ పూర్తిచేసిన వాటిలో కేవలం 263 ఇండ్లకు ఒక్కోదానికి రూ. లక్ష చొప్పున బిల్లులు చెల్లించారు.
జహీరాబాద్, మే 3: నా పేరు ఔటి కవేరి. ఊరు న్యాల్కల్ మండలం చీకూర్తి గ్రామం. రెండేండ్ల క్రితం నా భార్త గుండెపోటుతో చనిపోయాడు. నాకు గుంట భూమి లేదు. కూలీనాలి పనులు చేసుకుని ఇద్దరు పిల్లలతో బతుకుతున్నాను. రేకుల ఇంటిలోనే పిల్లలతో ఉంటున్నాం. ఇటీవల వడగండ్ల్ల వాన, గాలి దుమారంతో ఇంటిపైన ఉన్న రేకుల ఎగిరిపోయాయి. ఇంటిలోని తిండి గింజలు తడిసిపోయి తినడానికి రాకుండా పోయాయి. మమ్మల్ని ఏ అధికారి ఆదుకోలేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు మా బాధను అర్థం చేసుకొని ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి. – ఔటి కవేరి, గ్రామం. చీకూర్తి, న్యాల్కల్ మండలం, సంగారెడ్డి జిల్లా