చేర్యాల, మే 1 : రాష్ట్రంలో ప్రజాపాలన అందిస్తున్నాం, పారదర్శకంగా ప్రభుత్వ పథకాలను అర్హులైన వారికి అందజేస్తామని నిత్యం చెబుతున్న సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రుల ప్రకటనలకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న తీరుకు భిన్నంగా ఉంది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని ఆకునూరు గ్రామానికి మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు అర్హులా ? అనర్హులా అనే విషయాలపై అధికారులు కొందరు కాంగ్రెస్ నాయకులను వెంటబెట్టుకొని సర్వే చేస్తున్నారు.ప్రభుత్వ పథకానికి అసలైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు నిర్వహిస్తున్న సర్వే సమయంలో అధికారులు, కింది స్థాయి సిబ్బంది ఉంటేనే లబ్ధిదారుల వివరాలు పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం ఉంటుంది.
ఇప్పటికే అనర్హులకు ఇందిరమ్మ (జాబితాలో) ఇండ్ల మంజూరులో చోటు కల్పించారని గ్రామానికి చెందిన కొందరు కాంగ్రెస్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, నాయకులు బాహాటంగా విమర్శిస్తున్న సమయంలో కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులతో అధికారులు సర్వే చేయడం విమర్శలకు తావిస్తున్నది. గురువారం మండలంలోని ఆకునూరులో ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో ఉన్న లబ్ధిదారులను గుర్తించి అర్హులా లేదా అనర్హులా అనే విషయాన్ని తేల్చేందుకు ఎంపీడీవో మహబూబుఅలీ, గ్రామ కార్యదర్శితో పాటు పంచాయతీ సిబ్బంది, పలువురు కాంగ్రెస్ నాయకులతో సర్వే నిర్వహించారు.దీనిని పలువురు లబ్ధిదారులతో పాటు ఇతర పార్టీల నాయకులు గమనించారు. అధికారులు సర్వే నిర్వహించిన సమయంలో అధికార పార్టీ నాయకులు ఎందుకు వారితో ఉంటున్నారనే విషయాన్ని చర్చించుకున్నారు.
కాంగ్రెస్ నాయకులు సైతం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల సర్వేను ఎంపీడీవో మహబూబ్అలీ, కార్యదర్శి సందీప్ నిర్వహించారని, అందులో కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. అధికారులు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు వెళ్లిన సమయంలో అధికార పార్టీ నాయకులను వెంటబెట్టుకొని వెళ్లడం సరికాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఎంపీడీవో మహబూబ్అలీని ‘నమస్తే తెలంగాణ’ ఫోన్లో వివరణ కోరగా ఇందిరమ్మ కమిటీ సభ్యులతో సర్వే చేస్తున్నామని, కాంగ్రెస్ నాయకులు ఎవరూ లేరని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం సర్వే చేస్తున్నట్లు తెలిపారు.