గుమ్మడిదల,మే 30: ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన పేదలకు అందడం లేదని మున్సిపాలిటీ వార్డు ప్రజలు ఆందోళన చేశారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి మున్సిపల్ వార్డులో సుమారు 10 వేల జనాభా ఉంటుంది. ఇందులో ఆరు వేలకు పైగా ఓట్లు ఉన్నాయి. మొదటి విడతలో ఇందిరమ్మ కమిటీ ప్రమేయం లేకుండా ఒకే ఒకరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది.
శుక్రవారం శంకుస్థాపనకు వచ్చిన మండల అధికారులపై మున్సిపల్ వార్డులోని కాంగ్రెస్ నాయకుడు, మాజీ సర్పంచ్ సురభి నాగేందర్‌గౌడ్, బీఆర్ఎస్ నాయకులు ఆలేటి శ్రీనివాస్‌రెడ్డి,గిద్దెరాజు, సురభి వినోద్‌గౌడ్, ఆలేటి సంజీవరెడ్డి, లక్ష్మీనారాయణ, గ్యారల మల్లేశ్‌ముదిరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వార్డులో 10 వేల మంది జనాభాలో అర్హులు ఒక్కరేనా..? అని ప్రశ్నించారు. అర్హులైన పేదలకు ఇండ్లు మంజూరు చేసే వరకూ ఇందిరమ్మ ఇండ్ల శంకుస్థాపన చేయరాదని నిరసన వ్యక్తం చేశారు.
దీంతో ఎంపీడీవో ఉమారాణి, మున్సిపల్ అధికారులు వెనుదిరిగారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసే వరకు ఎలాంటి భూమి పూజ చేయరాదని మున్సిపల్ వార్డు కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. వీరితో పాటు ఉప్పనూతల వినయ,సుధాకర్, లక్ష్మణ్, శ్రీశైలం, సత్తారం ప్రభాకర్, తలుపుల శ్రీనివాస్, కూర శంకర్, మనీల, జాంగీర్బీ ఉన్నారు. కాగా ఎంపీడీవో ఉమారాణి, మున్సిపల్ కమిషనర్ రఘు, ఆర్వోలు సంగీత, జీపీ సెక్రటరీ సంతోషా, ఆత్మకమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డితో పాటు ఆయా గ్రామాల నాయకులు కొత్తపల్లి, నాగిరెడ్డిగూడెం, అన్నారం గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం శంకుస్థాపనలు చేశారు.