మెదక్, మార్చి 16(నమస్తే తెలంగాణ): హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రజలు ఆరోపిస్తున్నారు. 2025, జనవరి 26న పైలెట్ ప్రాజెక్టు కింద ప్రతి నియోజకవర్గంలోని ఒక గ్రామాన్ని ఎంపిక చేసి పథకాల గ్రౌండింగ్కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గ్రామాల్లో అర్హులందరికీ వందశాతం సంక్షేమ పథకాలు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పింది. కానీ, క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. పైలెట్ గ్రామాలుగా ఎంపికైన మెదక్ జిల్లా హవేళీ ఘనపూర్ మండలం కొచ్చెరువు తండా, కొల్చారం మండలం పోతిరెడ్డిపల్లి గ్రామాల్లో ప్రభుత్వ పథకాల అమలుపై ‘నమస్తే తెలంగాణ’ ఫీల్డ్ విజిట్ చేసింది.
ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించి ఎంపిక చేసిన గ్రామాల్లో లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేశారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో నిబంధనల ప్రకారం రైతుభరోసా మినహా మిగతా మూడు పథకాలు నిలిచిపోయాయి. ఇప్పుడు కోడ్ ముగిసినా ఇప్పటి వరకు కొచ్చెరువు తండా, పోతిరెడ్డిపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల ఊసేలేదు. ఒక్క ఆత్మీయ భరోసా మాత్రమే అర్హులందరికీ వచ్చింది. కానీ, రైతుభరోసా మాత్రం పూర్తిస్థాయిలో కాలేదని గిరిజనులు ఆరోపిస్తున్నారు.
మెదక్ జిల్లా హవేళీ ఘనపూర్ మండలం కొచ్చెరువు తండాలో 512 మంది జనాభా ఉంది. 120 గృహాలు ఉన్నాయి. ఈ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం 181 మంది దరఖాస్తులు చేసుకోగా, 27 మందికి మాత్రమే మంజూరయ్యాయి. ఈ తండాలో ఇప్పటి వరకు ఒక్క ఇందిరమ్మ ఇంటి నిర్మాణం మొదలు పెట్టలేదు. లబ్ధిదారులకు ఉన్న ఖాళీ స్థలాల్లో మాత్రమే ముగ్గుపోసి వదిలేశారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 54 మందికి డబ్బులు మంజూరయ్యాయి. కొల్చారం మండలం పోతిరెడ్డిపల్లిలో 310 ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తులు చేసుకోగా, 59 ఇండ్లు మామ్రే మంజూరయ్యాయి. కేవలం 2 ఇండ్లు మాత్రమే గ్రౌండ్ లెవల్లో ఉన్నాయి. వాటికి కూడా బిల్లులు రాలేదు.
జిల్లాలో ఇప్పటి వరకు పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన గ్రామాలు, వార్డుల్లోనే పథకాలను అమలు చేసిన ప్రభుత్వం మిగతా గ్రామాలు, వార్డుల్లో అమలు విషయంపై స్పష్టత ఇవ్వడం లేదు. అర్హులందరికీ ఒకేసారి ఇస్తారా..? లేక విడతల వారీగా ఇస్తారా అనే దానిపై కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో నియోజకవర్గానికి 3,500 చొప్పున మొదటి విడతలో ఇస్తామని చెప్పారు. మిగతా గ్రామాల్లో ఏ వర్గానికి ఎప్పుడు ఇస్తారనే విషయమై స్పష్టత లేక దరఖాస్తుదారులు అయోమయంలో ఉన్నారు. ఎన్నికల కోడ్ ముగిసినా ఇంకా ఇందిరమ్మ ఇండ్లను మొదలుపెట్టడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వస్తేనే పథకాల అమలుపై ప్రజల్లో నెలకొన్న అనుమానాలు నివృత్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి.