చేర్యాల, ఏప్రిల్ 29: గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీల్లో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. సిద్దిపేట జిల్లా చేర్యాలలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎంపికలో అవకతవకలు జరిగాయని పలువురు కాంగ్రెస్ నాయకులు భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. ఇండ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాల్సి ఉండగా, అనర్హులకు జాబితాలో చోటు కల్పించడంపై పలువురు కమిటీ సభ్యు లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మండలంలోని ఆకునూరులో ఇందిరమ్మ కమిటీ సభ్యులకు తెలియకుండానే 49 మంది లబ్ధిదారులతో కూడి న జాబితా ఇటీవల బయటకు వచ్చింది. దీనిని పరిశీలించిన ఇందిరమ్మ కమిటీ సభ్యులు అసలు తమకు తెలియకుండానే లబ్ధిదారులను ఎవరు నిర్ణయించారని, ఇందులో అనర్హులకు చోటు కల్పించారని, తమ సంతకాలు లేకుండా లిస్టు ఎలా వస్తుందని, వెంటనే వాటిలో మార్పులు చేర్పులు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మె ల్యే, ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసిన ఆకునూరుకు చెందిన పలువురు యువకు లు ఇందిరమ్మ ఇల్లు వస్తుందనే ఆశతో ఉన్నారు.
తీరా లిస్టులో వారి పేర్లు లేకపోవడంతో ఈనెల 28న గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లి ఈవోకు లిస్టులో అనర్హులు ఉన్నారని, వారిని తొలిగించి అర్హులకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ముస్త్యాలలో అర్హులకు ఇండ్లు కేటాయించాలని సీపీఎం ఆధ్వర్యంలో ప్రత్యేకాధికారికి వినతిపత్రం అందించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నినాదాలు చేశారు. కొన్ని గ్రామా ల్లో ఇందిరమ్మ ఇంటికి రూ.50 వేల డబ్బులు అధికార నాయకులు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణ లు వినిపిస్తున్నాయి. అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయిస్తామని చేర్యాల ఎంపీడీవో మహబూబ్ అలీ ‘నమస్తే తెలంగాణ’ ఫోన్లో తెలిపారు.