సంగారెడ్డి, జనవరి 16(నమస్తే తెలంగాణ): ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పథకం అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పుతున్నది. ఎన్నికలకు ముందు వ్యవసాయ కూలీలందరికీ రూ. 12వేల ఆర్థిక సాయం అందజేస్తామని హామీ ఇచ్చింది. తీరా ఇప్పుడు కోతలకు పాల్పడుతున్నది. ప్రభుత్వ చర్యతో సంగారెడ్డి జిల్లాలోని వ్యవసాయకూలీలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి దూరం అవుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో కేవలం 30శాతం మందికి మాత్రమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వర్తించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం తీరుపై వ్యవసాయ కూలీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రేవంత్‌రెడ్డి సర్కార్ ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పి ఇప్పుడు తమను మోసం చేస్తున్నదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయ కూలీ కుటుంబాలకు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం’ కింద రూ.12వేలు ఆర్థిక సాయం అందజేయనున్నది. రెండు విడతలుగా ఈ ఆర్థిక సాయం అందజేయనున్నది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అందరికీ వర్తింపజేయకుండా కోతలు విధిస్తూ కేవలం భూమిలేని కూలీలకు, 20రోజుల ఈజీఎస్ పనిదినాలు పూర్తి చేసుకున్న కూలీలకు మాత్రమే పథకం వర్తింపజేస్తామని నిబంధనలు విధించింది.
ఈ నిబంధనలతో జిల్లాలోని వ్యవసాయ కూలీలకు తీవ్ర అన్యాయం జరగనున్నది. ప్రభుత్వ నిబంధనలను అనుసరించి సంగారెడ్డి జిల్లాలో కేవలం 30శాతం మందికి అంటే 29వేల మందికి మాత్రమే ఈ పథకం వర్తించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పథకం అమలులో భాగంగా ఇప్పటికే 20 రోజుల పనిదినాలు పూర్తి చేసుకున్న వ్యవసాయ కుటుంబాలను గుర్తించారు. ఆధార్ సీడింగ్ పూర్తిచేశారు. 20 పనిదినాలు పూర్తి చేసుకున్న వ్యవసాయ కుటుంబాల్లో వ్యవసాయభూమి ఉన్న కూలీల గుర్తింపు ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. రెండురోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. అనంతరం గ్రామసభలు నిర్వహించి పథకం అర్హుల గుర్తింపు, ప్రకటన ఉంటుంది. 26వ తేదీ నుంచి అర్హులైన లబ్ధిదారులకు మొదటి విడతగా రూ.6వేలు ఖాతాల్లో జమచేస్తారు.
Medak3
నిబంధనలతో చాలామంది దూరం..
సంగారెడ్డి జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీకి వెళ్లి పొట్టపోసుకునే వ్యవసాయ కూలీల సంఖ్య ఎక్కువగా ఉంది. జిల్లాలో 2,18,600 ఈజీఎస్ కార్డులు ఉన్నాయి. 4,01,726 మంది వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. అనారోగ్యం, ఇతరత్రా కారణాలతో కూలీలు వరుసగా ఈజీఎస్ పథకంలో పనిచేయరు. ఇలా పనిచేయని వారిని ఈజీఎస్ అధికారులు గుర్తించి నాన్యాక్టీవ్ వర్కర్స్‌గా పేర్కొంటున్నారు. జిల్లాలో ప్రతిరోజు పనికి వచ్చే కూలీలను అధికారులు గుర్తించి వారికి కూలీ చెల్లింపులు చేస్తారు. సంగారెడ్డి జిల్లాలో 1,31,104 జాబ్‌కార్డులపై 2,23,769 మంది యాక్టీవ్ కూలీలు ఉన్నారు. ఇందులో యాక్టీవ్ ఎస్సీ కూలీలు 70,052, ఎస్టీ కూలీలు 31,238, ఇతరులు 1,22,479 మంది ఉన్నారు. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ప్రతి వ్యవసాయ కూలీకి ఏడాదికి రూ.12వేల ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించింది.
అధికారంలోకి వచ్చాక ఇప్పుడు మాట తప్పి సెంటుభూమి ఉన్న వ్యవసాయ కూలీలకు ఆత్మీయ భరోసా పథకం ఇవ్వమని నిబంధన విధించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 20కంటే ఎక్కువ ఈజీఎస్ పనిదినాలు పూర్తి చేసుకున్న కుటుంబాల్లో ఒకరికి మాత్రమే ఇందిర్మ ఆత్మీయ భరోసా పథకం వర్తింపజేస్తామని చెబుతున్నది. ప్రభుత్వ నిబంధనల కారణంగా జిల్లాలో కేవలం 30శాతం మందికి మాత్రమే ఇందిరమ్మ భరోసా పథకం వర్తించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 1,31,104 జీఎస్ యాక్టీవ్ కార్డులు ఉండగా, ఇందులో 2023-24 ఆర్థిక సంవత్సరంలో 20రోజులకు పైగా పనిదినాలు పూర్తి చేసుకున్న కూలీలను ఈజీఎస్ అధికారులు గుర్తించారు.
యాక్టీవ్ కూలీ కుటుంబాలు 94,454 ఉన్నాయి. యాక్టీవ్ జాబ్‌కార్డులు ఉన్న వ్యవసాయ కుటుంబాలతో పోలిస్తే 72శాతం మంది మాత్రమే 20 రోజులకు పైగా పనిదినాలు పూర్తి చేసుకున్నారు. వీరిలో వ్యవసాయభూమి ఉన్న కూలీల గుర్తించాలని ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో ఈజీఎస్ అధికారులు తమ వద్ద ఉన్న 94,454 మంది వ్యవసాయకూలీల వివరాలను రెవెన్యూ అధికారులకు అందజేశారు. రెవెన్యూ అధికారులు 94,454 వ్యవసాయ కూలీ కుటుంబాల్లో ఎంతమందికి భూమి ఉన్నది గుర్తిస్తున్నారు.
అధికారుల సమాచారం మేరకు 94,454 వ్యవసాయ కుటుంబాల్లో 40 శాతం మందికి కనీసం సెంటు భూమి ఉన్నట్లు సమాచారం. దీంతో 20 పనిదినాలు పూర్తి చేసుకున్న వారిలో 30 శాతం మంది కూలీలకు మాత్రమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం వర్తించే అవకాశాలు ఉన్నాయి. కుటుంబానికి ఒకరి చొప్పున లెక్కిస్తే సంగారెడ్డి జిల్లాలో 29వేల మందికి మాత్రమే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం లబ్ధి చేకూరే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో జిల్లాలో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వ్యవసాయ కూలీలకు నష్టం జరుగుతున్నది. ఉపాధి హామీ పథకంలో కూలీకి వెళ్లి పొట్టపోసుకునేది ఎక్కువగా పేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యవసాయ కూలీలే.