సిద్దిపేట, ఫిబ్రవరి 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి): యాసంగి సాగుకు విద్యుత్ వినియోగం పెరిగింది. డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా కావడం లేదు. తరుచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్నదని రైతు లు చెబుతున్నారు. ఇప్పుడే కరెంట్ కోతలు మొదలయ్యాయి. మరోవైపు భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. కాళేశ్వర జలాలు అన్ని ప్రాంతాలకు రావడం లేదు. ఫలితంగా యా సంగి పంటలు అప్పుడే ఎండిపోయే దశకు చేరుకుంటున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం, లోఓల్టేజీ సమస్యలతో వ్యవసాయ బావుల మోటర్లు కాలిపోతున్నాయి.
ట్రాన్స్ ఫార్మర్లు ట్రిప్ అవుతుండడంతో మోటర్లు కాలిపోయి బిల్లులు తడిసి మోపెడవుతున్నాయి. భూగర్భజలాలు అడుగంటుతుండడంతో రైతులు బోరుబావులు తవ్వించి అప్పుల పాలవుతున్నారు. రైతుల సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. వానకాలం రైతుభరోసా ఇవ్వలేదు. యాసంగికైనా రైతుభరోసా వస్తది అనుకున్న రైతుకు అడియాశనే అయ్యింది. రుణమాఫీ సంపూర్ణంగా కాలేదు, రైతు భరోసా అందడం లేదు, ఫలితంగా అప్పులు తెచ్చి పంటలు సాగుచేసిన రైతులకు పంట చేతికి వచ్చే వరకు భరోసా లేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు.
ఎండల తీవ్రత పెరగడంతో యాసంగి పంటలు అప్పుడే ఎండిపోతున్నాయి. భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. చెరువులు, కుంటలు ఎండిపోతున్నాయి. బోరుబావుల్లో నీటిమట్టం తగ్గింది. కాళేశ్వర జలాలు పూర్తిస్థాయిలో అందడం లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు విద్యుత్ మాటిమాటికి ట్రిప్ అవుతుండడంతో పారిన మడి పారుతున్నది. వరుస తాళ్లతోనైనా వరిచేన్లు బతికి బయటపడేలా లేవు. వరికి రోగాలు వచ్చి మందులు కొట్టి చేన్లు కోలుకుంటాయనే లోపే నీటి కష్టాలు మొదలయ్యాయి. రైతులు బావులు, బోర్లను నమ్ముకుని వరి సాగుచేశారు. ఇప్పుడు కండ్ల ముందే ఎండిపోతున్న పంటలను చూసి కన్నీళ్లు పెడుతున్నారు.
కొందరు రైతులు బోర్లు వేసేందుకు సిద్ధ పడుతుండగా, మరికొందరు రైతులు వ్యవసాయ బావుల్లో క్రేన్లా ద్వారా పూడికతీత పనులు మొదలు పెట్టారు. ఏడెనిమిది ఏండ్ల తర్వాత పంట చేన్లు ఎండిపోవడం చూస్తున్నామని, మళ్లీ పాత రోజులు యాదికి వస్తున్నాయని రైతులు పేర్కొంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఎండకాలం రాకముందే కాళేశ్వర జలాలతో జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు, హల్దీ, కూడవెల్లి వాగులు నింపడంతో సాగునీటి కష్టాలు రైతులకు ఎదురుకాలేదు. యాసంగిలో గుంట ఎండిపోకుండా రైతుల పంటలు పండించారు. ప్రతి చెరువును కాళేశ్వరం జలంతో ప్రభుత్వం నింపింది. ఫలితంగా బోరుబావుల్లో పుష్కలంల నీరు ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని రైతులు చెబుతున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు యాసంగి సాగు ప్రారంభం కాగానే ఏ ప్రాంతానికి ఏ మేర నీటిని విడుదల చేయాలి.. ఎన్ని చెరువులు నింపాలి.. అనే ఒక ప్రణాళికతో ముందుకు వెళ్లేవారు. ఫలింతగా అన్ని ప్రాంతాలకు కాళేశ్వర జలాలు అందాయి. ఫలితంగా బీఆర్ఎస్ హయాంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో పంటలు ఎండిపోయిన సందర్భాలు లేవు. ప్రధాన రిజర్వాయర్ల నుంచి కాలువల ద్వారా చెరువులు, చెక్‌డ్యామ్‌లకు నీటిని విడుదల చేయడంతో మండుటెండల్లో మత్తళ్లు దుంకాయి. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి మెదక్ జిల్లాలో కాళేశ్వర జలాల విడుదల కోసం రైతులు రాస్తారోకోలు చేస్తున్నారు.
ఉమ్మడి మెదక్ అన్నిరకాల విద్యుత్ కనెక్షన్లు 17,51,603 ఉన్నాయి. ప్రస్తుతం రోజుకు 34.2 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతున్నది.
సిద్దిపేట జిల్లాలో అన్నిరకాల విద్యుత్ కనెక్షన్లు 5,75,928 ఉన్నాయి. వీటిలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు 1,73,530, గృహాలు 3,53,346, పరిశ్రమలు 3,850, 45,202 ఇతర విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం రోజుకు 11.2 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతున్నది.
మెదక్ జిల్లాలో అన్ని రకాల విద్యుత్ కనెక్షన్లు 3,55,093 ఉన్నాయి. వీటిలో వ్యవసాయ బావుల విద్యుత్ కనెక్షన్లు 1,09,152, గృహ విద్యుత్ కనెక్షన్లు 2,09,174, పరిశ్రమలు 2,411, మిగతా ఇతర విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఈ జిల్లాలో ప్రస్తుతం నిత్యం 8 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతున్నది.
సంగారెడ్డి జిల్లాలో గృహ విద్యుత్ కనెక్షన్లు 6,14,652, వాణిజ్య 76,938, పరిశ్రమలు 5,504, వ్యవసాయం 1,06,061, ఇతర 17,427 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఈ జిల్లాలో అన్నిరకాల విద్యుత్ కనెక్షన్లు కలిపి 8,20,582 ఉన్నాయి. ప్రతిరోజు 15 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతున్నది.
కొమురవెల్లి, ఫిబ్రవరి 18 : ఎండకాలం ఇంకా మొదలేకాలే కరెంట్ గడికోసారి పోతున్నది. పోయినప్పుడల్లా 10 నిమిషాలు పోతున్నది. గిట్లా కరెంట్ పోతే రైతులకు మస్తు ఇబ్బంది అవుతాది. గిప్పుడే గిట్లా ఉంటే వచ్చే నెలలో ఎట్ల్లుంటాదో మరి. గీ ఎండలకు భూమిల నీళ్లు తగ్గుతాయి. గీ సమయంలో కరెంట్ పోయి మళ్ల వొచ్చేసరికి పంట తడి ఆరిపోవడమే గాక చివరిమడి ఎండిపోతాది. ప్రభుత్వం ఇప్పటికైనా వ్యవసాయానికి నిరంతరాయంగా మంచి కరెంట్ ఇవ్వాలి. గిప్పుడు వచ్చిపోయినట్లు వచ్చిపోతే చేనుల్లో పశువులను వదలడమే అయితాది.
– బుడిగె యాదగిరి, రైతు, గురువన్నపేట (సిద్దిపేట జిల్లా)