జహీరాబాద్, నవంబర్ 29: ఉత్తర దిశ నుంచి వీస్తున్న శీతల గాలులుతో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్నది. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్, జహీరాబాద్, మొగుడంపల్లి, కోహీర్ మండలాల్లో ఆత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం రాష్ట్రంలోనే న్యాల్కల్లో 7.9 డిగ్రీల రెండో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. కోహీర్‌లో 9.2 డిగ్రీలు, జహీరాబాద్ మండలం సత్వార్‌లో 9.3 డిగ్రీలు, మొగుడంపల్లిలో 9.8 డిగ్రీలు, జహీరాబాద్ మండలం మల్చల్మలో 10.1 డిగ్రీలు, ఆల్గోల్‌లో 11.2 డిగ్రీలు, జహీరాబాద్‌లో 12.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
చలికి ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఉదయం 9 గంటల వరకు చలి తీవ్రత తగ్గడం లేదు. ఉదయం పూట కూలీ పనులకు వెళ్లే కార్మికులు, రైతులు, కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు చలితో వణుకుతున్నారు. చలినుంచి రక్షణకు ఉన్ని దుస్తులు ధరిస్తున్నారు. చలిమంటలు కాచుకుంటున్నారు. ఉదయం 8గంటల వరకు సూర్యుడు రావడం లేదు. సాయంత్రం 6 గంటల్లోపే ఇండ్లలోకి జారుకుంటున్నారు. చిన్నారులు, వృద్ధ్దులు, ఆస్తమా రోగులు చలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
చలి తీవ్రత పెరగడంతో ముంబయి-హైదరాబాద్, జహీరాబాద్-ఝరాసంగం, కోహీర్, తాండూర్, వికారాబాద్, బీదర్-జహీరాబాద్, అల్లాదుర్గం, న్యాల్కల్-బీదర్, నారాయణఖేడ్‌కు వెళ్లే ప్రధాన రోడ్లు రాత్రివేళ 7గంటలకే నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. స్వెటర్లు, జర్కిన్, మఫ్లర్లు, మంకీ క్యాప్‌లు, ఉన్ని దుస్తులు, చేతులకు గ్లౌజులు, కాళ్లకు సాక్స్‌లు ధరిస్తున్నారు. చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో వృద్ధ్దులు, చిన్నారులు, బాలింతలు, గర్భిణులు తగు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.