మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 13 : కాంగ్రెస్ అధికార మదంతో ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ప్రలోభాలకు గురిచేసినా తట్టుకొని నిలబడి విజయ సాధించిన బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచుల పోరాట పటిమ అద్భుతమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశంసించారు. మెదక్ జిల్లాలో ఈనెల 11న జరిగిన తొలి విడత ఎన్నికల్లో పాపన్నపేట, ఘనపూర్ మండలాల్లో బీఆర్ఎస్ మద్దతుతో విజయం సాధించిన 26 మంది నూతన సర్పంచ్‌లు బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, బీఆర్ఎస్ మెదక్ నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతిరెడ్డిలతో కలిసి శనివారం హైదరాబాద్‌లో హరీశ్‌రావు నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు నూతన సర్పంచ్‌లను శాలువాలతో సత్కరించి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీసులను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తున్నదని విమర్శించారు. తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు ఓటుతోనే గట్టి గుణపాఠం చెప్పారన్నారు. డబ్బు సంచులతో ప్రలోభాలు పెట్టాలని చూసినా, బెదిరింపులకు పాల్పడినా ప్రజలు మాత్రం గులాబీ జెండా వైపే నిలిచారన్నారు. ఈ విజయం బీఆర్ఎస్ కార్యకర్తల మనోధైర్యానికి నిదర్శనం అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బీఆర్ఎస్ వెంటే ఉన్నారని ఈ ఫలితాలు స్పష్టం చేశాయని హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తయినా ఏ ఒక్క హామీ సరిగ్గా అమలు చేయలేదన్నారు.
కేసీఆర్ సంక్షేమ పథకాలకు కోతలు పెట్టిందని విమర్శించారు. ఈ మోసాన్ని ప్రజలందరూ గమనించి జీపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పారన్నారు. ముఖ్యంగా గిరిజన తండాల్లో మన అభ్యర్థులు సర్పంచులుగా గెలువడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజలు కేసీఆర్ నాయకత్వం కోసం, బీఆర్ఎస్ పాలన కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఉమ్మడి మెదక్ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే గెలిచారని పేర్కొన్నారు. మీరంతా మీ గ్రామాల అభివృద్ధి కోసం నిబద్ధతతో పనిచేయాలని పిలుపుపిచ్చారు. ప్రభు త్వం సహకరించకపోయినా ధైర్యంగా ఉండాలన్నారు. మీ వెనుక పార్టీ ఉంటుందని, కేసీఆర్ ఉన్నారని, ప్రజల పక్షాన నిలబడి కొట్లాడి నిధులు సాధించుకుందామని నూతన సర్పంచులకు హరీశ్‌రావు ధైర్యం చెప్పారు.