రామచంద్రాపురం, జూలై 20: సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లోని మేళ్ల చెరువు బఫర్ జోన్‌ని కబ్జాదారులు ఖతం చేస్తుండ్రు. చెరువు కట్ట పక్క నుంచి ఇష్టానుసారంగా మట్టి నింపుతూ లెవలింగ్ చేస్తున్నారు. చెరువు బఫర్ జోన్లో రాత్రికిరాత్రి పెద్దఎత్తున టిప్పర్లతో మట్టి నింపుతున్నా అధికారులు మౌనంగా ఉంటున్నారు. మేళ్ల చెరువు బఫర్‌జోన్‌లో మట్టిని నింపి, చెరువు కట్టకు సమానంగా లెవలింగ్ చేస్తున్నారని గ్రామస్తులు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు.
చెరువు తూముకు సంబంధించిన నాలా ఆక్రమణకు గురైందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చెరువులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఎలాంటి ఆక్రమణలకు పాల్పడకూడదనే నిబంధనలు ఉనప్పటికీ, ఎవరూ పట్టించుకోవడం లేదు. జలవనరులకు సంబంధించి బఫర్ జోన్లో ఆక్రమణలకు పాల్పడితే, కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం, హైడ్రా ఊదరగొట్టుడు తప్పా చర్యలు తీసుకోవడం లేదని పలువురు విమర్శిస్తున్నారు.
గరీబోళ్ల మీదికి వెళ్లే హైడ్రా బుల్డోజర్లు, శ్రీమంతులపైకి వెళ్లడం లేదనే విమర్శలు వస్తున్నాయి. తెల్లాపూర్‌లోని మేళ్ల చెరువు పరిధిలోని ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ఆక్రమణలకు గురవుతున్నప్పటికీ ఇరిగేషన్, రెవెన్యూ, హైడ్రా అధికారులు పట్టించుకోవడం లేదనే స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం మేళ్లచెరువు ఎఫ్టీఎల్తో పాటు నాలా ఆక్రమణలకు పాల్పడ్డారు. ప్రస్తుతం బఫర్‌ని వదలడం లేదు. ఒకవేళ పట్టా భూములు అయినప్పటికీ అధికారుల అనుమతి లేకుండా బఫర్‌లో మట్టిని నింపకూడదు. బఫర్‌లో కేవలం వ్యవసాయం కోసం భూమిని పటిష్టం చేసేందుకు మాత్రమే పూడీకతీత, మట్టిని కొంతమేర నింపుకోవచ్చు.
కానీ, తెల్లాపూర్‌లో అడ్డూ అదుపు లేకుండా బఫర్‌ని మొత్తం మింగేస్తూ ప్రైవేట్ వ్యాపారాలు చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. చెరువు బఫర్‌లో కబ్జాకు ప్రయత్నిస్తుండటంతో చెరువు ఉనికి ప్రశ్నార్థకంగా మారుతున్నది. రానున్న రోజులు బఫర్ మొత్తం కనుమరుగై వ్యాపార సముదాయాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత మెల్లగా నిర్మాణాలు వచ్చే ప్రమాదం ఉన్నదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా హైడ్రా, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు స్పందించి మేళ్లచెరువు బఫర్‌లో జరుగుతున్న ఆక్రమణలను అడ్డుకొని బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.