మునిపల్లి, మార్చి 14: కాంగ్రెస్ పాలనలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. గుట్టలను, మొక్కలను ధ్వంసం చేస్తూ దందా సాగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని పెద్దగోపులారం శివారులోని ప్రభుత్వ భూమిలో పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా బీఆర్ఎస్ హయాంలో హరితహారం కార్యక్రమంలో వందలాది మొక్కలు నాటి సంరక్షించారు. అప్పట్లో మొక్కలు నాటే కార్యక్రమంలో స్వయంగా కలెక్టర్ హనుమంత్‌రావు పాల్గొన్నారు.
మొక్కలు నాటిన ప్రాంతం ముంబయి జాతీయ రహదారికి దగ్గరలో ఉండడంతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని అప్పట్లో కలెక్టర్ హనుమంత్‌రావు మునిపల్లి అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత మొక్కల సంరక్షణ చేపట్టడంతో ఏపుగా పెరిగాయి. కాంగ్రెస్ సర్కారు వచ్చాక హరితహారం మొక్కల సంరక్షణను అధికారులు విస్మరించారు. ఇటీవల కొందరు అక్రమంగా మొరం తవ్వకాలు చేపడుతూ గుట్టలను కరిగిస్తూ మొక్కలను ధ్వంసం చేస్తున్నారు.
దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అక్రమార్కులు మొరం దందా కోసం మొక్కలు తొలిగిస్తున్నా మునిపల్లి మండల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని మండల వాసులు కోరుతున్నారు. మొక్కలు ధ్వంసం చేస్తూ మొరం అక్రమ దందా సాగిస్తుండడంపై పంచాయతీ కార్యదర్శి అక్తర్‌ను వివరణ కోరగా.. రెవెన్యూ అధికారులు వాటి సంగతి చూసుకుంటారని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.