మునిపల్లి, మార్చి 16: సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్చగా కొనసాగుతున్నాయి. కొంతమంది తాము మంత్రి దామోదర రాజనర్సింహ మనుషులం అంటూ దర్జాగా మట్టి దందా సాగిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. అక్రమార్కుల దాటికి ముంబయి జాతీయ రహదారి వెంట ఉన్న గుట్టలు కరిగిపోతున్నాయి.పర్యావరణానికి విఘాతం కలుగుతున్నది. మార్కెట్లో మొరానికి మంచి డిమాండ్ ఉండడంతో కొందరు అక్రమార్కులు రాత్రీపగలు అని తేడాలేకుండా గుట్టలను తవ్విస్తూ మొరం తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ముంబయి జాతీయ రహదారిని ఆనుకొని పెద్దగోపులారం గ్రామ శివారులోని ప్రభుత్వ భూమిలో గుట్టల వద్ద ప్రయాణికులు ఫొటోలు దిగి అక్కడి ప్రకృతిని ఆస్వాదించేవారు.
ప్రస్తుతం ఇష్టానుసారంగా మట్టి తవ్వకాలు జరుపుతుండడంతో అందమైన గుట్టలు మాయమవుతున్నాయి.దీంతో హైవే వెంట వెళ్లే ప్రయాణికులతో పాటు ప్రకృతి ప్రేమికులు ఆవేదన చెందుతున్నారు. అడ్డూ అదుపు లేకుండా సాగుతున్న మట్టి అక్రమ తవ్వకాలపై సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మునిపల్లి మండలంలోని బుధేరా, పెద్దగోపులారం గ్రామాల శివారులో ఎప్పుడూ పచ్చని అటవీ సంపదతో కళకళలాడుతూ కనిపించే గుట్టలు, ప్రస్తుతం అక్రమ మొరం తవ్వకాలతో మాయమవుతున్నాయి. అక్రమార్జనే ధ్యేయంగా కొందరు జేసీబీలు, టిప్పర్లతో మొరం దోపిడీకి తెగబడుతున్నారు.
మునిపల్లి మండలం బుధేరా పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో గుట్టల నుంచి మొరాన్ని అక్రమంగా తరలిస్తూ వ్యాపారాన్ని సాగిస్తున్నా ఎవరూ చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వెంచర్లు వేసే యజమానులు ప్లాట్లు ఆకర్షణీయంగా కనబడాలనే ఉద్దేశంతో మొరం వేసి ప్లాట్లను చదును చేస్తుంటారు.రోడ్డు పనులను అడ్డం పెట్టుకొని కొంతమంది వ్యాపారులు మొరాన్ని రోజుకు వందల సంఖ్యలో టిప్పర్ల ద్వారా మునిపల్లి మండలం నుంచి సదాశివపేట, సంగారెడ్డి తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒక్క మునిపల్లి మండలంలోని రోజుకు అక్రమార్కులు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. ఒక్కో గుట్టను తొలిస్తే రోజుకు 100 ట్రిప్పుల వరకు టిప్పర్లతో మట్టి అక్రమంగా తరలించి బాగా వెనుకేసుకుంటున్నారు.
మండలంలో అక్రమంగా మొరం తవ్వకాలు జరుగుతున్నట్లు మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం. మండలంలో ఎక్కడైనా అక్రమ మొరం తవ్వకాలు జరిపితే, మండలం నుంచి ఇతర మండలాలకు అక్రమంగా తరలిస్తే రెవెన్యూ అధికారులకు ప్రజలు సమాచారం అందించాలి. మొరం తవ్వకాలకు మేము ఎవరికీ అనుమతులు ఇవ్వలేదు. అక్రమంగా మొరం తరలిస్తున్న వారు ఎవరైనా సరే కేసులు నమోదు చేస్తాం. వాహనాలకు జరిమానాలు విధిస్తాం. కొద్ది రోజుల క్రితం మునిపల్లి మండలంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాలను సీజ్‌చేసి జరిమానాలు విధించాం. మండల కేంద్రం మునిపల్లికి శివారులో జరుగుతున్న రోడ్డు పనులకు మొరం అవసరం ఉన్నట్లు ఆర్అండ్బి అధికారులు పర్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
– ఆశాజ్యోతి, మునిపల్లి తహసీల్దార్