సిద్దిపేట, మార్చి12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట జిల్లా మోయతుమ్మెద వాగు నుంచి ఇసుకను ఇష్టారాజ్యంగా తోడేస్తున్నారు. రోజూ వందల ట్రాక్టర్ల ఇసుక బయటకు తరలిపోతున్నది. ఇసుక అక్రమ రవాణా విషయమై సిద్దిపేట ఆర్డీవో, నీటి పారుదల శాఖ అధికారులకు విన్నవించుకుంటున్నా పట్టించుకోవడం లేదంటూ వాగు పరీవాహక ప్రాంత రైతులు ఆరోపిస్తున్నారు.
ధూళిమిట్ట మండలం జాలపల్లి, నంగునూరు మండలం ఖాతా, ఘణపూర్, పెద్దోళ్ల బావి, అక్కెనపల్లి, కోహెడ మండలం బస్వాపూర్ ప్రాంతాల్లో జోరుగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నది. మోయతుమ్మెద వాగు పరీవాహక ప్రాంతం ఎంత వరకు ఉందో అంతవరకు ఇసుకను తోడేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా కోసం వాగులో ప్రత్యేకంగా దారులు ఏర్పాటు చేసుకున్నారు. దారి కోసం సంబంధిత భూ యజమానులకు దూరాన్ని బట్టి డబ్బులు కూడా చెల్లిస్తున్నారు. ట్రాక్టర్లలో ఇసుక నింపడానికి ఏకంగా జేసీబీలు వాడుతున్నారు.
రాత్రివేళ మోయెతుమ్మెద వాగు ఇసుక జాతరను తలపిస్తున్నది. ఇసుక తీసేందుకు యువతను ఇసుక వ్యాపారులు బాగా వాడుకుంటున్నారు. వారిని పనిలో దించేందుకు మందు, గంజాయి తాగిస్తూ, బిర్యాని తినిపిస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్లు కూడా లేనివారితో రాత్రిపూట ట్రాక్టర్లు నడిపిస్తున్నారు. ఎవరైన ట్రాక్టరును అపితే అదే స్పీడ్తో వారిపై దాడికి యత్నిస్తున్నారు.
ఇలాంటి ఘటనలు సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంటున్నాయి. ఆ సమయంలో అక్కడికి రైతులు వెళ్లి ఇదేంటని ప్రశ్నిస్తే, ఇసుక మాఫియా బెదరింపులకు దిగుతున్నది. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకున్న పాపాన పోవడంలేదు. టాస్క్ఫోర్స్ అధికారులు వచ్చిన తూతూ మంత్రంగా దాడులు చేసి చేతులు దులుపుకొంటున్నారు. కఠిన చర్యలు తీసుకోవడం లేదని వాగు పరీవాహక ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విచ్చలవిడిగా సాగుతున్న ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని రైతులు తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్లు, స్థానిక అవసరాల పేరిట ఇసుకను వాగు నుంచి భారీగా తరలిస్తున్నారు. ఐదు ట్రాక్టర్ ట్రిప్పులకు పర్మిషన్ ఇస్తే, దాన్ని ఆసరాగా చేసుకుని ఇరవై నుంచి ముప్పై ట్రిప్పుల వరకు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. స్థానికులకు ట్రాక్టర్కు రూ.5 నుంచి 6 వేలు, వేరే గ్రామాలకు రూ.9 నుంచి 10 వేల వరకు వసూలు చేస్తుంటారు. దీనికి ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అనుమతి ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి తరలించాలి అనే పర్మిషన్ ఉంటుంది.
కానీ, అది ఎక్కడా జరగడం లేదు. మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులు ఇష్టారీతిగా ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇసుక తరలించేందుకు అనుమతులు ఇస్తున్నారు. దీంతో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. పర్మిషన్ ఐదు ట్రిప్పులకు ఉంటే, దాని పేరు మీద 20కి పైగా ట్రిప్పులు తరలిస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్ల వద్ద ఇసుక డంపు చేసి, అక్కడి నుంచి ఇసుకను వేరే ప్రాంతానికి యథేచ్ఛగా తరలించి డబ్బులు సంపాదిస్తున్నారు.