పటాన్చెరు, డిసెంబర్ 7: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో అధికార పార్టీ అండంతో మైనింగ్ కాంట్రాక్టర్లు రెచ్చిపోతున్నారు. అధికార పార్టీకి చెందిన ముఖ్యనేత కనుసన్నల్లో మైనింగ్ దోపిడీ విచ్చలవిడిగా సాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అక్రమ మైనింగ్ తవ్వకాలపై ఎవరైనా ప్రశ్నిస్తే దాడులకు దిగుతున్నారు. నిబంధనలకు విరుద్ధ్దంగా లోతుగా తవ్వకాలు చేసినా చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వానికి ఎలాంటి పన్నులు చెల్లించకుండా తవ్వకాలు చేసి కంకర తరలిస్తున్నారు. గనుల లీజు గడువు ముగిసినా అడ్డూఅదుపు లేకుండా తవ్వకాలు చేస్తున్నారు. మైనింగ్, విజిలెన్స్ అధికారులు ఎందుకు తనిఖీలు చేయడం లేదనే ప్రశ్నలు వస్తున్నాయి.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని రుద్రారం, లక్డారం గ్రామాల్లో 16 వరకు మైనింగ్ గనులు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి తీసుకున్న అనుమతుల కంటే అధికంగా తవ్వకాలు చేసినా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్‌రెడ్డికి చెందిన సంతోష్ శాండీ అండ్ గ్రానైట్ సైప్లె సంస్థ అక్రమ తవ్వకాలు చేయడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం కేటాయించిన క్వారీల కంటే ఎక్కువగా తవ్వకాలు చేసినట్లు గుర్తించి, కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వానికి రాయల్టీ ఎగ్గొట్టినట్లు గుర్తించారు.
పటాన్చెరు మండలంలోని రుద్రారం, లక్డారం గ్రామాల శివారులో కంకర మైనింగ్ గనులు ఉన్నాయి. రుద్రారం, లక్డారం గ్రామ శివారుల్లో 16 గనులు ఉండగా, మైనింగ్ కాంట్రాక్టర్లు ప్రభుత్వం నుంచి తీసుకున్న అనుమతుల కంటే అధికంగా తవ్వకాలు చేస్తున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. గనుల నుంచి మైనింగ్ తీసి కంకర తయారుచేసి సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు తరలించి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. టిప్పర్లలో సామర్థ్యానికి మించి తరలిస్తున్నారు. దీంతో రోడ్లు దెబ్బతినడంతో పాటు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా ఆయాశాఖల అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. అధికార పార్టీ నేతల అండతో కంకర తరలిస్తుండడంతో అధికారులు చర్యలు తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నట్లు తెలిసింది. మైనింగ్, విజిలెన్స్ అధికారులు గట్టి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. 50 నుంచి 100 అడుగుల లోతులో తవ్వకాలు చేస్తూ ప్రకృతి వనరులు దోస్తున్నారు.
రుద్రారం, లక్డారం శివారుల్లోని మైనింగ్ గనుల వద్ద అక్రమంగా బ్లాస్టింగ్లు జరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గనుల్లో 6 మీటర్ల నుంచి 10 మీటర్లలోపు తవ్వకాలు చేయాలి. కానీ, వ్యాపారులు అక్రమంగా 50 అడుగుల వరకు తవ్వకాలు చేపడుతున్నారు. లీజ్ ఏరియా బయట కంకర కోసం తవ్వకాలు చేసినట్లు గతంలో అధికారులు గుర్తించినా చర్యలు తీసుకోలేదు. గనుల్లో బ్లాస్టింగ్ చేసేందుకు పేలుడు పదార్థాల లైసెన్స్‌లు తీసుకోవాలి. పేలుడు పదార్థ్ధాలు నిల్వ చేసేందుకు అనుమతి ఉండాలి. అక్రమంగా బ్లాస్టింగ్ చేయడంతో కాలుష్యం ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శబ్ధ కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు పడినా, బ్లాస్టింగ్ చేసే సమయంలో ప్రమాదం జరిగినా బయటకు పొక్కకుండా వ్యాపారులు, కాంట్రాక్టర్లు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
పటాన్చెరు మండలంలోని గనుల్లో అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారని తెలిసినా మైనింగ్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. గతంలో గనులు తనిఖీలు చేసి పెద్ద ఎత్తున అక్రమ తవ్వకాలు జరిగినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించినా చర్యలు తీసుకోలేదు. అక్రమ తవ్వకాలు చేస్తున్న వ్యాపారులకు నోటీసులు జారీ చేయడం లేదు. మైనింగ్ తవ్వకాల గడువు ముగిసినా చర్యలు తీసుకోవడం లేదు. మైనింగ్ గడువు ముగిసినా తవ్వకాలు నిలిపివేయడం లేదు.
అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కనుసైగల్లో అక్రమ తవ్వకాలు చేపడతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వానికి రాయల్టీ ఎగ్గొడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. లారీలు, ట్రాక్టర్లు, టిప్పర్లు ద్వారా కంకర, చిప్స్, పౌడర్ ఇష్టారాజ్యంగా తరలిస్తున్నారు. మైనింగ్ గనులు పరిశీలించేందుకు అధికారులు రావడం లేదు. చెక్‌పోస్టు ఏర్పాటు చేసి తనిఖీలు చేయాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గనుల లీజు 20 ఏండ్ల పాటు ఉంటుంది. ప్రతి ఏడాది గనుల అనుమతుల లీజును రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. అధికార పార్టీకి చెందిన నాయకులు గనులపై కన్నేసి, అక్రమంగా తవ్వకాలు చేస్తూ కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు.