సంగారెడ్డి, అక్టోబరు 25: శాసనసభ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ను గెలిపిస్తే గ్యాస్ రూ.400లకే పంపిణీ చేస్తామని, ప్రజల మనిషి చింతా ప్రభాకర్‌ను గెలిపించాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవారం పట్టణంలోని 26వ వార్డులో ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన మైనార్టీలు చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో మంత్రి సమక్షంలో గులాబీ కండువాలు కప్పుకున్నారు. అంతకుముందు మదీనా చౌరస్తాలో 4 వార్డులకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే నాయకుడు ప్రభాకర్‌ను గెలిపించుకోవాలని, కరోనా కష్టకాలంలో బాధితులకు అండగా నిలిచిన నాయకుడు ప్రభాకర్ అని గుర్తు చేశారు. పట్టణాభివృద్ధికి కృషి చేస్తూ నారాయణఖేడ్ బహిరంగసభలో సీఎం కేసీఆర్ రూ.50కోట్ల నిధులు మంజూరు చేస్తామని ప్రకటించి ఉత్తర్వులు జారీ చేశారన్నారు.
ఈ నిధుల్లో రూ.17కోట్ల పనులు పూర్తికాగా మిగతా నిధులను ఎన్నికల అనంతరం ఖర్చు చేసి అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. పదేండ్లలో అన్నిరంగాల్లో రాష్ర్టాన్ని అభివృద్ధి చేసుకున్నామని, ముఖ్యంగా మైనార్టీ విద్యార్థులకు రెసిడెన్షియల్ జూనియర్ కళశాలలు ఏర్పాటు చేసి మెరుగైన విద్యను అందించామన్నారు. ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి మైనార్టీ విద్యార్థులకు డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాలలు ఏర్పాటు చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రకటించారని గుర్తుచేశారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రూ.300 ఉన్న గ్యాస్ సిలిండర్ ధరలను ఏకంగా రూ.వెయ్యికి పెంచి పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలపై భారంమోపిందన్నారు. రైతుబీమాతో రాష్ట్రంలో 1.17లక్షల మందికి రూ.5లక్షల పరిహారాన్ని ప్రభుత్వం అందజేసిందన్నారు. ‘కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికీ’ ధీమా అనే పథకాన్ని అందించేందుకు సీఎం ప్రకటించారని గుర్తు చేశారు. పదేండ్లలో చేసిన అభివృద్ధి ప్రజల కండ్ల ముందు కనిపిస్తున్నదని, మరోసారి అవకాశమిస్తే దేశంలోనే అభివృద్ధిలో ప్రథమ స్థానంలో ఉంటుందన్నారు.
ప్రజల ఓట్లతో గెలిచి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకుండా ఎమ్మెల్యే హైదరాబాద్‌కే పరిమితమయ్యారని మంత్రి హరీశ్‌రావు దుయ్యబట్టారు. ప్రజల ఓట్లతో గెలిచి అపదలో ఉన్న వారిని ఆదుకోవాల్సిన ఎమ్మెల్యే కనీసం ఫోన్లో కూడా అందుబాటులో ఉండకపోవడం నియోజకవర్గ ప్రజలు చేసుకున్న దురదృష్టమన్నారు. ఈసారి ఎన్నికల రావడంతో మరోసారి ప్రజలను మాయమాటలు చెప్పి మోసంచేసేందుకు వస్తున్నారని, ఎమ్మెల్యే మాటలకు మోసపోకుండా నిత్యం అందుబాటులో ఉండే వ్యక్తి చింత ప్రభాకర్ భారీ మెజార్టీతో గెలిపించి అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రజలు తీసుకునే నిర్ణయంతో అభివృద్ధి, సంక్షేమం పథకాలు ప్రజలకు అందించేందుకు బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలన్నారు.
గత ఎన్నికల్లో ఎమ్మెల్యే భార్య, కూతుళ్లు ప్రజల ముందుకొచ్చి కన్నీళ్లు పెట్టుకోవడంతో ఎమ్మెల్యేగా గెలిచిన జగ్గారెడ్డి ఐదేండ్లపాటు ప్రజలను పట్టించుకోలేదని బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ విమర్శించారు. ఎన్నికలు రాగానే ప్రజల ముందుకొచ్చి మోసలి కన్నీళ్లతో మోసం చేసి గెలవాలని కుట్రలు చేసే ఎమ్మెల్యేకు తగిన విధంగా బుద్ధి చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని, కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో అమలుకు సాధ్యంకాని హామీలతో గెలవాలని తాపత్రయ పడుతున్నదన్నారు. పక్క రాష్ట్రం కర్ణాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని, అక్కడి ప్రజలు వాట్సాప్‌ల్లో పోస్టులు పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నిస్తున్నారన్నారు. సంగారెడ్డిలో తనను గెలిపించాలని ప్రజలకు ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, రాష్ట్ర ఫైనాప్స్ కార్పొరేషన్ చైర్మన్ భూపాల్‌రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యమ్, మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, నాయకులు, మామిళ్ల రాజేందర్, వెంకటేశ్వర్లు, నర్సింహులు, షేక్ సాబేర్, పార్టీలో చేరిన కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.