రామాయంపేట, మార్చి 31: అసెంబ్లీ ఎన్నికల్లో గ్యారెంటీల పేరుతో పాటు ఇతర అనేక హామీలు ఇచ్చి అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు ఓటుతో ఎంపీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం మెదక్ జిల్లా రామాయంపేటలో బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ మూడు నెలల పాలనపై ఇప్పుడే ప్రజలకు విసుగు వచ్చిందన్నారు. కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలను మరిచిపోయారని, ప్రజలు సైతం వారిని మరిచిపోవాలన్నారు. మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి మంచి మనసున్న వ్యక్తి అని, ఆయన ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నతాధికారిగా అనేక పనులు చేశాడని కొనియాడారు. ప్రభుత్వానికి సంబంధం లేకుండా వెంకట్రామిరెడ్డి ప్రజలకు సాయం చేస్తారన్నారు.మాయమాటలు చెప్పే బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావును ఎవరూ నమ్మరని, ఆయనకు ఈ ఎన్నికల్లో భంగపాటు తప్పదని అన్నారు. దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచి హామీలు అమలు చేయకుండా మోసం చేసిన రఘునందన్‌ను ప్రజలు చిత్తుగా ఓడించాలని పద్మాదేవేందర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
మెదక్ ఎంపీ స్థానంలో కచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని, కార్యకర్తలందరూ సమష్టిగా కృషిచేస్తే బీజేపీ, కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా రావని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి అన్నారు. ఎంపీగా గెలిపిస్తే మీతో కలిసి జిల్లా అభివృద్ధికి పనిచేస్తానని అన్నారు. మెదక్ అసెంబ్లీ స్థానంలో పద్మాదేవేందర్‌రెడ్డి స్వల్ప ఓట్లతో ఓడిపోవడం బాధాకరమని, తనను ఎంపీగా గెలిపించి ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకుందామని పిలునిచ్చారు. ఎంపీ గెలిస్తే ఎమ్మెల్యే లేని లోటును పూడ్చవచ్చని అన్నారు.తనకు మెదక్ నియోజకవర్గంతో ఎంతో అనుబంధం ఉందని, ఉమ్మడి మెదక్ ప్రజలకు తాను కొత్తేమి కాదన్నారు. జిల్లాలో ఇన్చార్జి కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టానని, ఈ ప్రాంత ప్రజల భాగోగులు తనకు చాలా తెలుసన్నారు. అధికారిగా 25 ఏండ్లు పనిచేపిన అనుభవం తనకు ఉందని, ప్రజాసేవ చేసేందుకు 2021లో కలెక్టర్ ఉద్యోగాన్ని త్యజించి అప్పటి సీఎం కేసీఆర్, హరీశ్‌రావు సహకారాలతో ఎమ్మెల్సీగా రాజకీయాల్లో అడుగిడినట్లు వెంకట్రామిరెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రం అన్నింటా ముందు వరుసలో నిలిచిందని, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో తిరోగమనంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను వ్యక్తిగతంగా అనేక సహాయ కార్యక్రమాలు చేస్తున్నానని, పలువురు అనాథలను అక్కున చేర్చుకుని వారికి అండగా నిలిచినట్లు తెలిపారు. తనను ఎంపీగా గెలిపిస్తే గెలిచిన 9 నెలల్లో మెదక్ ఎంపీ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రూ.2 కోట్ల చొప్పున వెచ్చించి మండలానికో ఫంక్షన్ హాల్ నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ ఇప్పిస్తానన్నారు.పీవీఆర్ ట్రస్టు ఏర్పాటు చేసి బీఆర్ఎస్ కార్యకర్తలు, పేదలకు ఆర్థికంగా అండగా నిలుస్తానని వెంకట్రామిరెడ్డి హామీ ఇచ్చారు. సమావేశంలో మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్ల్లోళ్ల శశిధర్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి కంటారెడ్డి తిరుపతిరెడ్డి, రాష్ట్ర నాయకుడు దేవేందర్‌రెడ్డి, రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు గజవాడ నాగరాజు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పాలన మూడు నెలల పాలనకే ప్రజలకు విసుగు వచ్చిందని, ఆరు గ్యారెంటీలు ఇస్తామంటూ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తిరిగిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఎక్కడకి పోయారని ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి ప్రశ్నించారు. అలవికాని హామీలు ఇచ్చి ఇప్పుడు చేతులు ఎత్తేశారని, కాంగ్రెస్‌కు ప్రజల నుంచి నిరసన తప్పదన్నారు. ఒకరిని విమర్శించే ముందు తమ గురించి, తమ పనితనం గురించి ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలుకు భ్రమలు వీడాయని, బీజేపీ తెలంగాణకు ఏమిచేసిందని ఓటేయాలని ఆయన ప్రశ్నించారు.తెలంగాణను, మెదక్ జిల్లాను అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ అన్నారు. కేసీఆర్ సంక్షేమ పాలన అందిస్తే, కాంగ్రెస్ మోసపూరిత విధానాలను అవలంభిస్తున్నదని ఆయన విమర్శించారు. రైతుల సంక్షేమాన్ని కాంగ్రెస్ సర్కారు పూర్తిగా విస్మరించిందన్నారు. మెదక్ జిల్లాతో ఎంతో అనుబంధం ఉన్న వెంకట్రామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి సత్తాచాటుదామని క్యాడర్‌కు ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి పిలుపునిచ్చారు.