Liquor | మెదక్, జూలై 8 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లాలో పాలు, టీ, కాఫీ రూపంలో రోజూ సుమారు 1200 లీటర్ల పాలు తాగుతుండగా.. మద్యం వాడకం మాత్రం దానికి రెట్టింపుగా ఉంది. పాలకు రెండు రేట్లు అధికంగా విస్కీ, బ్రాందీ, బీర్, వైన్ ఇలా అన్ని రకాల లిక్కర్ కలిపి దాదాపు 30వేల లీటర్ల వరకు మందుబాబులు తాగేస్తున్నారు. ఒకప్పుడు ఉదయం లేవగానే టీ లేనిదే మహిళలు, ప్రజలు పొలం పనులకు వెళ్లేవారు కాదు. అయితే మందు ఎప్పుడో ఒకసారి ముట్టుకునే వారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ఎప్పుడు తెల్లవారుతుందా.. 10 గంట లు ఎప్పుడు అవుతుందా అని ఎదురుచూస్తున్నారు మందుబాబులు. ఇదిలావుండగా పట్టణాలతోపాటు పల్లెల్లో కూడా మద్యం దుకాణాలు వెలియడంతో ఇక మందుకు తక్కువేమిలేదు అన్నట్టు ఉంది. కొన్ని సంవత్సరాలుగా మద్యం తాగే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. వృద్ధులతో పోటీగా యువత కూడా మద్యానికి అలవాటు పడడడంతో అమ్మకాలు జోరందుకున్నాయి.
మెదక్ జిల్లాలో 49 మద్యం దుకాణాలు, 4 బార్లు ఉన్నాయి. జనవరి నుంచి జూన్ వరకు రూ.291.31 కోట్ల వ్యాపారం జరిగింది. ఇదీ మరింత పెరిగి సెప్టెంబర్ వరకు రూ.350 కోట్లకు చేరనుంది. ఒక విస్కీ, బ్రాందీ ఫుల్ బాటిల్ 750 ఎంఎల్ అంటే 12 ఫుల్ బాటిళ్లతో కూడిన కాటన్లో 9 లీటర్ల మద్యం ఉంటుంది. ఈ విధంగా ఆరు నెలల్లో అమ్మిన కాటన్లు 300312 విక్రయించారు. ఒక్కో బీర్ 650 ఎంఎల్, ఒక్కో పెట్టెలో 12 బీర్ల చొప్పున లెక్కిస్తే 7.8 లీటర్లు. ఆరు నెలల్లో అమ్మిన బీరు కేసులు 4,66,549 మద్యం మందుబాబులు తాగినట్లు లెక్కా. మొత్తంగా ఆరు నెలల వ్యవధిలోనే రూ.291.31 కోట్ల వ్యాపారం జరిగింది.
మెదక్ జిల్లాలో రోజూ 1200 లీటర్ల పాలు అమ్ముతున్నారు. జిల్లాలో 120 కేంద్రాలు ఉండగా, ఇందులో 7 బీఎంసీ(చిన్న తరహా పాత శీతల కేంద్రాలు) ఉన్నాయి. మెదక్, రామాయంపేట, చేగుంట, వడియారం, పాపన్నపేట, పెద్దశంకరంపేట, రేగోడ్, కౌడిపల్లి కేంద్రాలు నడుస్తున్నాయి. మొత్తంగా 1600 మంది రైతులు రోజూ పాల ను కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. ఇంట్లో పాలు తాగే చంటి పిల్లలున్నా, ఇన్ని హోటళ్లు, టీ పాయింట్లు నడుస్తున్నా ఒక్కొక్కరు రోజుకు రెండు లేదా మూడు సార్లు టీ, కాఫీ తాగుతున్నా మెదక్ జిల్లాలో రోజూ 1200 లీటర్ల పాలు మాత్రమే అమ్ముడుపోతున్నాయి. ప్రస్తుతం లీటరు పాల ధర రూ.60 పలుకుతున్నది.
సంగారెడ్డి జూలై 8(నమస్తే తెలంగాణ): ఆరోగ్యకరమైన పాలకంటే లిక్కర్ అమ్మకాలు సంగారెడ్డి జిల్లాలో జోరుగా సాగుతున్నాయి. దీంతో పాలకంటే మద్యం అమ్మకాలు పదింతలు పెరిగాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రతిఒక్కరూ 180 మిల్లీలీటర్ల నుంచి 260 మి.లీటర్ల పాలు తాగాలి. జిల్లాలో ప్రతిరోజూ 50వేల లీటర్లకుపైగా పాల అమ్మకాలు జరుగుతున్నాయి. విజయ డెయిరీ రోజూ 4892 మంది నుంచి 9545 లీటర్ల పాలు సేకరించి అమ్ముతుంది. ఇతర డెయిరీలు, డెయిరీ వ్యాపార సంస్థలు రోజూ 20వేల లీటర్ల వరకు పాలు అమ్మకాలు జరుపుతున్నాయి. అయితే పాల ను మించి జిల్లాలో మద్యం అమ్మకాలు సాగుతున్నాయి. రోజూ 70వేల లీటర్లకుపైగా మద్యాన్ని మందుబాబులు తాగేస్తున్నారు. దీంతో మద్యం అమ్మకాలు 20 శాతం పెరిగాయి. రోజూ జిల్లాలో రూ.5 కోట్ల వరకు మద్యం అమ్మకాలు సాగుతున్నాయంటే మ ద్యంప్రియులు పాలపై కంటే మద్యంపై ఎంత ఖర్చు చేస్తున్నారో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. సంగారెడ్డి జిల్లాలో గతేడాదిలో 90,9,042 కేసుల మద్యం, 13,38, 822 కేసుల బీర్లు అమ్ముడుపోయాయి.
వీటి విలువ రూ.900 కోట్ల వరకు ఉంటుంది. డిసెంబర్ 2023 నుంచి జూన్ 2024 వరకు సంగారెడ్డి జిల్లాలో 10,4, 4643 కేసుల లిక్కర్, 14,12,274 కేసుల బీర్లు అమ్ముడుపోయాయి. వీటి విలువ రూ.1002. 01 కోట్లు ఉంటుంది. గతేడాదితో పోలిస్తే సంగారెడ్డి జిల్లాలో లిక్కర్ అమ్మకాలు 20శాతంపైగా పెరిగాయి. లిక్కర్ అమ్మకాలు 14.92 శాతం, బీరు అమ్మకాలు 5.49 శాతం పెరిగాగాయి. మద్యం అమ్మకాలపై ఆదాయం సైతం గతేడాదితో పోలిస్తే 11.25 శాతం పెరిగింది. సంగారెడ్డి జిల్లాలో 101 మద్యం దుకాణాలు, 101 పర్మిట్‌రూమ్‌లు ఉన్నా యి. నిబంధనల మేరకు మద్యం దుకాణాల్లో మాత్ర మే మద్యం అమ్మకాలు జరిగాలి. అయితే నిబంధనలకు విరుద్ధంగా ప్రతి గ్రామంలో బెల్టుషాపులు నడుస్తున్నాయి. ఒక వైన్‌షాపు పరిధిలో 20 నుంచి 40 వరకు బెల్టుషాపులు గ్రామాల్లో కొనసాగుతున్నాయి. దీంతో గ్రామాలు, పట్టణాల్లో మందుతాగే వారి సంఖ్య పెరుగుతుండటంతో గొడవలు, నేరాలు పెరుగుతున్నాయి.