జహీరాబాద్, అక్టోబర్ 16 : ప్రైవేటు వ్యక్తుల బారి నుంచి తమ ఇండ్ల స్థలాలను కాపాడి న్యాయం చేయాలని కోరుతూ గురువారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని మున్సిపల్ కార్యాలయాన్ని ఐడీఎస్ఎంటీ కాలనీ బాధితులు ముట్టడించి, తాళంవేసి ధర్నా నిర్వహించారు.బీఆర్ఎస్ నేతలు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తంజీం, మాజీ కౌన్సిలర్ నామరవికిరణ్ తదితరులు ఐడీఎస్ఎంటీ బాధితులకు మద్దతుగా ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. 20 ఏండ్ల క్రితం ఐడీఎస్ఎంటీ కాలనీలోని 158 సర్వేనంబర్‌లో ఇండ్ల స్థలాలను తాము మున్సిపాలిటీ నిర్దేశించిన రేట్లకు కొనుగోలు చేసి ఇండ్లు కట్టుకున్నట్లు తెలిపారు. అప్పట్లోనే మున్సిపల్ అధికారులు కాలనీలో రహదారులు, మురుగుకాల్వలు, తాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించారని గుర్తుచేశారు.
ఇటీవల కొందరు ప్రైవేటు వ్యక్తులు ఐడీఎస్ఎంటీ కాలనీలోని 10 ఎకరాల స్థలాన్ని కోర్టు తమకు చెందినది అని తీర్పు ఇచ్చి ఉత్తర్వులు జారీచేసిందని తమ ఇండ్లను జేసీబీతో కూల్చివేశారన్నారు. కాలనీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంజీరా తాగునీటి పైపులైన్, రహదారులు, మురుగుకాల్వను పోలీసు బందోబస్తు మధ్య ప్రైవేటు వ్యక్తులు కూల్చివేసి ఫెన్సింగ్ వేశారన్నారు. ఈ సమస్యను మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని, అందుకే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా చేపట్టినట్లు బాధితులు తెలిపారు.
అప్పట్లో ఇండ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్ చేసి ఇండ్ల పత్రాలు ఇచ్చిన మున్సిపల్ అధికారులు, ఇప్పుడు మౌనంగా ఉండడం సరికాదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి స్థలం ఉంటే, ఐడీఎస్ఎంటీ కాలనీలో మరోచోట ఇండ్ల స్థలాలను కేటాయించాలని డిమాండ్ చేశారు. కట్టుకున్న ఇండ్లను కూల్చివేయడంతో రోడ్డునపడ్డ తమకు నష్టపరిహారం చెల్లించి, ఇండ్లను మంజూరు చేసేలా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
బాధితులు మున్సిపల్ కార్యాలయానికి తాళం వేసి ధర్నా చేపట్టడంతో విధులకు హాజరైన అధికారులు, సిబ్బంది ఆరుబయటనే ఉండాల్సి వచ్చింది. జహీరాబాద్ పట్టణ సీఐ శివలింగం, ఎస్సై వినయ్‌కుమార్ సిబ్బందితో మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని తాళం తీయాలని నాయకులు, బాధితులను కోరారు. బాధితులు ససేమిరా అన్నారు. మున్సిపల్ కార్యాలయానికి తాళం వేయడం సరికాదని, బాధితుల సమస్యలను అధికారులతో మాట్లాడాలని నాయకులకు పోలీసులు సూచించడంతో కార్యాలయానికి వేసిన తాళం తీసి అక్కడే ధర్నాకు దిగారు. దీంతో నాయకులు, బాధితులను అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నించడంతో జరిగిన తోపులాటలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ తంజీంతో పాటు ఒక మహిళా బాధితురాలు సొమ్మసిల్లి పడిపోయారు. మిగిలిన నాయకులు, బాధితులను ఆరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బాధితులకు అండగా పోరాటం చేస్తామని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు.