రామచంద్రాపురం, జనవరి 30: సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మేళ్ల చెరువు ఆక్రమణలపై హైడ్రా చర్యలు చేపట్టింది. మేళ్లచెరువు ఎఫ్టీఎల్ వరకు ట్రెంచ్ కొట్టి ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. గ్రామస్తులు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు. ఇటీవల తెల్లాపూర్‌కు వచ్చిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ మేళ్లచెరువుని సందర్శించారు. చెరువు ఎఫ్టీఎల్లో నింపిన మట్టిని తొలిగించాలని భూమి యజమాని రాజుయాదవ్కు సూచించారు. వారంరోజుల్లో చెరువు ఎఫ్టీఎల్లో ఉన్న మట్టిని, వేసిన ఫెన్సింగ్ తొలిగించాలని చెప్పినప్పటికీ ఆయన పట్టించుకోలేదు.
శుక్రవారం ఉదయం హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. చెరువు పరిసరాల్లో వందలాది మంది పోలీసులు మోహరించారు. జేసీబీలతో చెరువు ఎఫ్టీఎల్లో నింపిన మట్టిని తొలిగించి ఎఫ్టీఎల్ మార్కుచేసి ట్రెంచ్కొట్టి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. భవిష్యత్‌లో కూడా చెరువు ఎఫ్టీఎల్ పరిధి కబ్జాకు గురికాకుండా ఫెన్సింగ్ వేసి చెరువు బయట నోటీస్ బోర్టు ఏర్పాటు చేశారు. మేళ్లచెరువులో ఫెన్సింగ్ ఏర్పాటు నేపథ్యంలో చెరువు ఎఫ్టీఎల్ పరిసరాల్లోకి ఎవరూ రాకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఫెన్సింగ్ ఏర్పాటు పనులు జరిగాయి. మేళ్లచెరువు ఎఫ్టీఎల్లో మట్టిని నింపడం, నిర్మాణాలు చేపట్టడం వంటి చర్యలు చేయకూడదని కేవలం వ్యవసాయం మాత్రమే చేసుకోవాలని భూ యజమాని రాజుయాదవ్కు హైడ్రా అధికారులు సూచించారు.
మేళ్ల చెరువు మాదిరిగానే తెల్లాపూర్‌లో ఉన్న వనంచెరువు, చెలికుంటల పరిధిలోని ఎఫ్టీఎల్లో ఉన్న ఆక్రమణలు తొలిగించి ఫెన్సింగ్ ఏర్పాటు చేయించాలని బీఆర్ఎస్ నాయకుడు, సాగునిటి సంఘం మాజీ చైర్మన్ వడ్డె నర్సింహులు హైడ్రా అధికారులను డిమాండ్ చేశారు. మూడు రోజుల క్రితం ‘నమస్తే తెలంగాణ’లో ‘మక్తకుంట’ ఆక్రమణలపై వచ్చిన కథనం నేపథ్యంలోనే హైడ్రా తెల్లాపూర్ పరిధిలోని చెరువులపై దృష్టికి సారించిందని, తెల్లాపూర్, ఉస్మాన్‌నగర్, కొల్లూర్, ఈదులనాగులపల్లి, వెలిమెల గ్రామాల్లో ఉన్న అన్ని చెరువులను హైడ్రా పరిశీలించి ఫెన్సింగ్ ఏర్పాటు చేయించి భవిష్యత్ తరాలకు మేలు జరుగేలా చూడాలని పలువురు కోరుతున్నారు.