సంగారెడ్డి, ఆగస్టు 31(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలోనూ హైడ్రా గుబులు కమ్ముకుంది. చెరువుల, కుంటలను పరిరక్షించేందుకంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు, అమీన్పూర్లో నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నది. శనివారం పటాన్చెరు, అమీన్పూర్ మండలాల్లో పర్యటించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధ్దం కావాలని అధికారులకు సూచించినట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలో హైడ్రా నోటీసులపై సామాన్యుల్లో భయం నెలకొంది. నోటీసులు వచ్చిన వెంటనే తమ ఇండ్లను కూల్చివేస్తారని సామాన్యులు ఆందోళనకు గురవుతున్నారు. చెరువుల, కుం టల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాలు ఉన్నాయ ని ఇప్పుడు హైడ్రా నోటీసులు ఇవ్వడంపై ప్రజలు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. చెరువులు, కుంటల ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో నిర్మాణాలకు హెచ్ఎండీఏ, మున్సిపల్ అధికారులు అనుమతులు ఇచ్చారని, నాడు సక్రమమైన నిర్మాణాలు ఇప్పుడు అక్రమం ఎలా అ య్యాయని ప్రశ్నిస్తున్నారు.
అక్రమ నిర్మాణాల పేరు తో ఇండ్ల్లను కూల్చేముందు అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. హైడ్రా వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నేతలు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏండ్ల క్రితం ఇం డ్లు నిర్మించుకుని ఉండగా, ఇప్పుడు వచ్చి ఇండ్లు కూలుస్తామని చెప్పడం సరికాదంటున్నారు. పటాన్చెరు, అమీన్పూర్, రామచంద్రాపురం మండలాల్లోని చెరువు లు, కుంటల ఎఫ్టీఎల్, బఫర్జోన్లలోని నిర్మాణాలపై కోర్టుల్లో కేసులు ఉండడంతో పాటు స్టేలు ఉన్నాయి. దీనికి తోడు ఎన్జీటీ సైతం స్టేలు ఇచ్చింది. హైడ్రా వీటి ని పరిశీలిస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు, అమీన్పూర్లో చెరువులు, కుంటల్లో అక్రమ నిర్మాణాలు ఉన్నాయంటూ నోటీసులు ఇచ్చేందుకు హైడ్రా సన్నద్ధమవుతున్నది. శనివారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పటాన్చెరు, అమీన్పూర్లో పలు చెరువులను పరిశీలించి అధికారులు ఎఫ్టీఎల్, బఫర్జోన్ల అక్రమణ, నిర్మాణాల గురించి ఆరాతీశారు.
అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారికి నోటీసులు ఇవ్వాల్సిందిగా హైడ్రా కమిషనర్ ఆదేశించినట్లు తెలిసింది. దీంతో త్వరలో హైడ్రా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. పటాన్‌చెరులోని సాకి చెరువు, అమీన్‌పూర్‌లోని శంభునికుంట, శెట్టికుంట, పెద్దచెరువు, బందంకొమ్ము చెరువుల్లోని ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. అమీన్‌పూ ర్ మండలంలోని కిష్టారెడ్డిపేట, పటేల్గూడతో పాటు మరికొన్ని గ్రామాల్లో చెరువు, కుంటల ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో అక్రమ నిర్మాణాలపైనా హైడ్రా దృష్టిపెట్టినట్లు సమాచారం.
రామచంద్రాపురం మండలం తెల్లాపూర్‌లోని మేళ్ల చెరువు, ఉస్మాన్గనర్లోని చెలికుంట, వనం చెరువు ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో నిర్మాణాలపైనా అధికారులు వివరాలు సేకరించారు.ఇక్కడ కూడా హైడ్రా నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏండ్ల క్రితమే చెరువుల ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో అధికారు లు ఇండ్లు, అపార్టుమెంట్ల నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు. నాడు అనుమతులు ఇచ్చిన అధికారులపై మొదట చర్యలు తీసుకోవాలని, ఆ తర్వాతే సామాన్యులకు నోటీసులు ఇవ్వాలన్న డిమాండ్ పెరుగుతున్నది.