హుస్నాబాద్, మే 15: హుస్నాబాద్ పట్టణ ప్రజలు ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న ఎల్లమ్మ చెరువు సుందరీకరణ అనేది కలగానే మిగులుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హుస్నాబాద్ నియోజకవర్గంలోనే అతిపెద్ద చెరువైన ఎల్లమ్మ చెరువు సుందరీకరణ జరిగి అక్కడికి పిల్లలు, కుటుంబ సభ్యులతో సహా వెళ్లి ఆనందంగా గడపాలనుకునే పట్టణ ప్రజల కల నెరవెరేలా లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కట్ట మరమ్మతుతోపాటు సుందరీకరణ పనులు ప్రారంభమై కొన్ని పనులు పూర్తయ్యాయి. కొత్త ప్రభుత్వం రాగానే ఈ పనులకు గ్రహణం పట్టినట్లయింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులతో కట్టకు మరమ్మతులు, పలు సుందరీకరణ పనులు పూర్తయ్యాయి. ఇంకా 70శాతం పనులు పెండింగ్‌లో ఉన్నా యి. మిగతా పనులు పూర్తిచేయడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన పొన్నం ప్రభాకర్ మంత్రి అయినప్పటికీ నియోజకవర్గంలోని ప్రధానమైన అభివృద్ధి పనులు ముందుకు సాగకపోవడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పనులు పూర్తి చేయాలని మంత్రిని కోరుతున్నారు.
హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చడంతోపాటు పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.10కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇందులో రూ.6.50 కోట్లతో కట్ట మరమ్మతులు, పూడికతీత పనులు చేపట్టారు. అనంతరం సుందరీకరణ పనుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం మరో రూ.3.50 కోట్ల నిధులు విడుదల చేసింది. పనుల్లో భాగంగా చిల్డ్రన్స్ పార్కు, బోటింగ్, బతుకమ్మ ఘాట్, వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. బతుకమ్మ ఘాట్ పనులు పూర్తికాగా, వాకింగ్ ట్రాక్ పనులు సగం వరకే పూర్తయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఐదు నెలలు దాటుతున్నా చెరువు కట్ట పనులను పట్టించుకునే వారు కరువయ్యారు. అర టీఎంసీకి పైగా నీళ్లు నిల్వ ఉండే హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులు, చిల్ట్రన్స్ పార్కు, కట్టపై వాకింగ్ ట్రాక్, పూలమొక్కల పనులు పూర్తయితే పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఆహ్లాదం దొరుకుతుంది. ఇప్పటికైనా మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.