మునిపల్లి, జనవరి 30: ఒడిశా నుంచి హైదరాబాద్కు తరలిస్తున్న 32కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని, ఏడుగురిని రిమాండ్కు తరలించినట్లు సంగారెడ్డి జిల్లా అదనపు ఎస్పీ సంజీవరావు తెలిపారు. గురువారం మునిపల్లి మండలం బుధేరా పోలీస్స్టేషన్లో మీడియాకు వివరాలు వెల్లడించా రు. ఒడిశాలోని గణపతి జిల్లాకు చెందిన బికాస్ కుమార్మాలీ, రావుసాహెబ్ గెనాకాలే, దూకల్లె వసంత్ బాబురావు, హన్మంత్ రామదాస్ పవార్ ముఠాగా ఏర్పడ్డారు.
వీరు ఒడిశా నుంచి ఎండు గంజాయిని సేకరించి గుట్టుచప్పుడు కాకుండా కార్లల్లో మహారాష్ట్రకు తరలిస్తారు. కర్ణాటకలోని బీదర్, గుల్బర్గా, మహారాష్ట్రలోని పుణే, షోలాపూర్, మాలెగావ్, వాశి, గోవాకు చెందిన వారికి అమ్మి అక్రమ మార్గంలో డబ్బులు సంపాదిస్తున్నారు. గంజాయి తరలిస్తున్న వారి నుంచి రూ. 50వేల నగదు, బొలేరో పికప్ వాహనం, బొలోరో వాహనం, ఒక స్విఫ్ట్ కారు, పది సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు అదనపు ఎస్పీ తెలిపారు. సమావేశంలో కొండాపూర్ సీఐ వెంకటేశ్, మునిపల్లి ఎస్సై రాజేశ్ నాయక్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.