సిద్దిపేట, ఏప్రిల్ 16(నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మెతుకు సీమ సిద్ధమవుతున్నది. ఉద్యమాలకు పురిటిగడ్డ ఉమ్మడి మెదక్ జిల్లా ఆది నుంచి గులాబీ పార్టీకి అండగా నిలిచింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈప్రాంత బిడ్డ కావడంతో మొదటి నుంచి జిల్లా ప్రజలు బీఆర్ఎస్ పార్టీ అంటే తమ ఇంటి పార్టీగా భావిస్తున్నారు. ఈనెల 27న నిర్వహించే బహిరంగ సభకు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల నుంచి గులాబీ శ్రేణులు భారీగా తరలివెళ్లి కేసీఆర్‌పై తమకున్న అభిమానాన్ని చాటేందుకు ఎదురుచూస్తున్నారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జనసమీకరణ, ఇతర అంశాలపై పార్టీ అధినేత కేసీఆర్ ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ బాధ్యులతో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో ఇటీవల సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ ఆదేశాలతో ఎమ్మెల్యే హరీశ్‌రావు పార్టీ జిల్లాల అధ్యక్షలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి రెండు లక్షల మంది పార్టీ శ్రేణులు వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సన్నాహక సమావేశాలు నిర్వహించారు.
ఉమ్మడి జిల్లా నుంచి
సిద్దిపేట నియోజకవర్గం నుంచి 20 వేల మందికి పైగా సభకు వెళ్లేందుకు ఎమ్మెల్యే హరీశ్‌రావు పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులు, యువత, రైతులు అందరూ సభకు వెళ్లనున్నారు. గజ్వేల్ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో హరీశ్‌రావు పాల్గొని పార్టీ నేతలకు సూచనలు చేశారు. గజ్వేల్ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, నాయకులు మాదాసు శ్రీనివాస్ ఇతర నాయకులు సభ విజయవంతంపై దృష్టిసారించారు. గజ్వేల్ నుంచి 20 వేల మందికి పైగా వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. దుబ్బాక నియోజకవర్గం నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు , ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో సుమారు 20 వేల మంది శ్రేణులు వెళ్లేందకు సిద్ధ్దమవుతున్నారు.
సభకు అతి దగ్గరగా ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ఎక్కువ మొత్తంలో వెళ్లనున్నారు. జనగామ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి నేతృత్వంలో పార్టీ శ్రేణులు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మాన కొండూరు నుంచి మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నేతృత్వంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. మెదక్ నుంచి పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్సీ శేరిసుభాష్‌రెడ్డి, ఇతర నేతల నేతృత్వంలో సుమారుగా 10 వేల మంది, నర్సాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి నేతృత్వంలో సభకు వేలాదిగా వెళ్లేందుకు చురుగ్గా ముమ్మర ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, అందోల్ నుంచి మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, పటాన్చెరువు నుంచి పార్టీ ఇన్చార్జి ఆదర్శ్‌రెడ్డి నేతృత్వంలో భారీగా వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. జహీరాబాద్‌లో ఎమ్మెల్యే మాణిక్‌రావు, నారాయణ్‌ఖేడ్‌లో మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించారు. రజతోత్సవ సభ జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గాలకు దూరంగా ఉండడంతో ఇక్కడి నుంచి 4 నుండి 5 వేల మంది ముఖ్యనేతలు, పార్టీ నాయకులు తరలివెళ్లేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
స్వచ్ఛందంగా రజతోత్సవ సభకు తరలివెళ్లేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు సమాయత్తం అవుతున్నారు. కొన్నిచోట్ల తొవ్వ ఖర్చుల నిమిత్తం కూలీ పని చేసి వచ్చిన డబ్బులను వాహనాల ఖర్చులకు ,ఇతర వాటికి సమకూర్చుకుంటున్నారు. ఇప్పటికే బెజ్జంకి మండలం లక్ష్మిపూర్‌లో మహిళా నేతలు కూలీ పనిచేసి తొవ్వ ఖర్చులు సిద్ధ్దం చేసుకున్నారు. నంగునూరు మండలం ఘణపూర్ పార్టీ క్యాడర్ తమ తొవ్వ ఖర్చుల కోసం కూలీ పని చేసి డబ్బులు సమకూర్చు కున్నారు. సిద్దిపేట పట్టణంలో బీఆర్ఎస్వీ నేతలు కూలి పనిచేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో రజతోత్సవ సభకు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. గ్రామ గ్రామమా వాల్ రైటింగ్ రాయిస్తున్నారు. గోడలపై సభ ప్రచార పోస్టర్లను అతికిస్తున్నారు. చలో వరంగల్ అంటూ పెద్ద ఎత్తున వాల్ రైటింగ్‌ను స్థానిక ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ ముఖ్యనాయకుల పేర్ల మీద రాయించారు.
ఎటు చూసినా వరంగల్ సభ వాల్ రైటింగ్‌లు జిల్లాలో పెద్దఎత్తున కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. మండలం, గ్రామాల వారీగా పార్టీ నాయకలు సమావేశాలు నిర్వహించుకొని సభకు వెళ్లేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధ్దం చేస్తున్నారు.అవసరమైన బస్సులు, డీసీఎంలు, ఇతర వాహనాలను బుకింగ్ చేశారు. ఆయా నియోజకవర్గాలకు అవసరం మేరకు ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ బస్సులను బుక్ చేసుకున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి భారీగా తరలివెళ్లి ఉద్యమాల గడ్డ అని మరోసారి సత్తా చాటాలని గులాబీ దండు ఎదురు చూస్తున్నది.
ఈనెల 25న ఉదయం సిద్దిపేట అమరవీరుల స్తూపం నుంచి సిద్దిపేట నియోజకవర్గంలోని దాదాపు 1500 మంది యువత, విద్యార్థులు పాదయాత్రగా ఎల్కతుర్తి రజతోత్సవ సభకు బయలుదేరి వెళ్లనున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు వారికి దిశానిర్దేశం చేశారు. సిద్దిపేట నుంచి బయలుదేరిన యువత పాదయాత్ర 27న సాయంత్రం రజతోత్సవ సభకు చేరుకుంటుంది.
ఈ పాదయాత్ర ప్రత్యేకంగా ఉండనున్నది. ప్రత్యేకమైన టీషర్టులు, టోపీలు, గులాబీ జెండాలతో గులాబీ సైన్యం సిద్దిపేట నుంచి హుస్నాబాద్ మీదుగా ఎల్కతుర్తి రజతోత్సవ సభకు చేరుకుంటుంది. ప్రతి గ్రామం నుంచి 10 నుండి 15 మంది యువత బయలు దేరుతుంది. ఇప్పటికే పాదయాత్రగా వెళ్లే యువత తమ పేర్ల జాబితాను పార్టీ బాధ్యులకు అందించారు. వీరి వెంట కళాజాత ఉండనున్నది.