Medak | మెదక్, ఫిబ్రవరి 27(నమస్తే తెలంగాణ)/సంగారెడ్డి :పంచాయతీల మనుగడకు కీలకమైన ఇంటిపన్ను వసూలు ప్రక్రియ జిల్లాల్లోని అన్ని గ్రామ పంచాయతీల్లో ముమ్మరంగా కొనసాగుతున్నది. మార్చి నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో వందశాతం లక్ష్యాన్ని చేరే దిశగా పంచాయతీ అధికారులు కృషిచేస్తున్నారు. ఫిబ్రవరి 20 వరకు మెదక్ జిల్లాలో 73.89శాతం, సంగారెడ్డి జిల్లాలో 81.56శాతం వసూలయ్యాయి. వందశాతం లక్ష్యాన్ని చేరుకోవడానికి పంచాయతీ కార్యదర్శులు, మిగతా సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పన్ను వసూలు చేస్తున్నారు. పన్ను వసూలు ద్వారా వచ్చే ఆదాయం నుంచి 5 శాతం సాధారణ, 30శాతం వేతనాలు, 15 శాతం వీధి దీపాల నిర్వహణ, మౌలిక వసతుల కల్పన, పారిశుధ్య పనులకు ఖర్చుచేస్తారు. వీటితో పాటు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు, గ్రాంట్స్ విడుదల చేస్తుండడంతో గ్రామసీమలు పచ్చదనం,పరిశుభ్రత, పారిశుధ్యం విషయంలో పట్టణాలను తలపిస్తున్నాయి.
గ్రామ పంచాయతీల్లో పన్నుల వసూలు ప్రక్రియ వేగం పుంజుకుంది. మార్చి నెలాఖరు వరకు ఆర్థిక సంవత్సరం ముగియనుండడంతో అధికారులు లక్ష్యాన్ని చేరే దిశగా కృషిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని గ్రామ పంచాయతీలకు కార్యదర్శులను నియమించడంతో పన్ను వసూలులో నిమగ్నమయ్యారు. జనవరి నుంచే పన్ను వసూలు జోరందుకుంది. ఫిబ్రవరి 20 వరకు మెదక్ జిల్లాలో 73.89 శాతం, సంగారెడ్డి జిల్లాలో 81.56 శాతం వసూలయ్యాయి.
మెదక్ జిల్లాలో 469 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.10.21 కోట్ల పన్నులు వసూలు చేయాలని జిల్లా యంత్రాంగం లక్ష్యం పెట్టకున్నది. ఇప్పటి వరకు రూ.7.54 కోట్ల పైచిలుకు వసూలయ్యాయి. నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా పన్ను వసూలుకు జిల్లా పంచాయతీ అధికారి కృషిచేస్తున్నారు. మార్చి నెలాఖరుకు ఎట్టి పరిస్థితుల్లో వందశాతం వసూలు చేసేలా సిబ్బందికి ఆదేశించారు. ఆస్తి పన్ను, నీటి బిల్లులు, లైసెన్స్ ఫీజులు, స్టాంప్‌డ్యూటీ, ఇతర అనుమతుల ద్వారా వచ్చే ప్రత్యక్ష పన్నులు, ఇతర ఆదాయాన్ని నాన్ ట్యాక్స్‌గా పరిగణిస్తారు.
పన్నుల వసూలు ద్వారా వచ్చే ఆదాయం నుంచి 5 శాతం సాధారణ, 30 శాతం వేతనాలు, 15 శాతం వీధి దీపాల నిర్వహణ, మౌలిక వసతుల కల్పన, పారిశుధ్య పనులకు వినియోగిస్తారు. మెదక్ జిల్లాలో 21 మండలాల్లో 469 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు కేవలం రెండు మండలాల్లోనే 90శాతం పన్ను వసూలు చేశారు. రామాయంపేట మండలంలో 91.60 శాతం కాగా, నార్సింగి మండలంలో 91.72 శాతం వసూలయ్యాయి. టేక్మాల్ మండలంలో 88.22 శాతం, పాపన్నపేట మండలంలో 84.81 శాతం, చిన్నశంకరంపేట మండలంలో 82.13 శాతం, కొల్చారం మండలంలో 80.89 శాతం పన్నులు వసూలయ్యాయి.
సంగారెడ్డి జిల్లాలో 25 మండలాల్లో 647 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ ఏడాది రూ.38.38 కోట్ల పన్ను వసూలు టార్గెట్ ఉండగా, ఇప్పటి వరకు రూ.32 కోట్లు వసూలయ్యాయి. మనూర్ మండలం ఫిబ్రవరి వరకు 96.17శాతం వసూలుతో జిల్లాలో నంబర్‌వన్ స్థానంలో ఉన్నది. 70.45శాతంతో కొండాపూర్ మండ లం చివరి స్థానంలో ఉన్నది. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మండలాలు మొదటి మూడు స్థానాల్లో నిలవడం గొప్పవిషయం. జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న కొండాపూర్ మండలం చివరి స్థానంలో నిలిచింది. జిల్లాలో మార్చి 31 వరకు రూ.38.38 కోట్ల పన్ను వసూలు పూర్తయితేనే వందశాతం వసూలైనట్లు లెక్క. జిల్లాలోని 25 మండలాల్లో రూ.38.38 కోట్ల టార్గెట్ ఉండగా, రూ.32 కోట్లు వసూలయ్యాయి. జిల్లాలో 81.56గా వసూలు శాతం నమోదు కాగా, 100 శాతం పూర్తి చేయాలని టార్గెట్‌తో అధికారులు పనిచేస్తున్నారు. పట్టణ ప్రాంతాలైన జహీరాబాద్, జిన్నారం, హత్నూర, పటాన్చెరు, సంగారెడ్డి, రామచంద్రాపురం వంటి మండలాల్లో అనుకున్న స్థాయిలో ప న్ను వసూలు కాలేదు. దీంతో పంచాయతీ అధికారులు వసూలుకు శ్రమిస్తున్నారు.
జిల్లాలోని 469 గ్రామ పంచాయతీల్లో వంద శాతం పన్ను వసూలు చేస్తాం. ఇప్పటి వరకు 80 శాతం మేర వసూలు చేశాం. ప్రతి మండలానికి నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తిచేసేలా సిబ్బందికి సూచిస్తున్నాం. జిల్లాలో రూ.10.21 కోట్ల పన్ను వసూలు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు రూ.7.54 కోట్ల వైచిలుకు వసూలైంది. మార్చి నెలాఖరు వరకు వంద శాతం లక్ష్యాన్ని చేరుకుంటాం.
-సాయిబాబా, డీపీవో మెదక్
జిల్లాలో పన్ను వసూలు ఆశాజనంగా ఉంది. మార్చి నాటికి రూ.38 కోట్ల టార్గెట్‌ను పూర్తి చేస్తాం. గతంలో కంటే పన్ను వసూలు లక్ష్యం పెరిగింది. ఇప్పుడు రూ.38కోట్లకు పెరిగింది. వచ్చే ఏడాది టార్గెట్‌ను రూ.40 కోట్లకు పైగా పెంచుతాం. పంచాయతీ సిబ్బందికి టార్గెట్లు విధించి పన్ను వసూలు చేస్తున్నాం. అందరూ బాగా పనిచేస్తున్నారు. మొత్తం అమౌంట్ పరంగా చూస్తే జిల్లాది పెద్ద టార్గెట్. పన్నుల వసూలు విషయంలో అన్ని గ్రామాల్లో ప్రజలు అధికారులు, సిబ్బందికి సహకరించాలి. పన్నులు చెల్లించి గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలి.
– సురేశ్‌మోహన్, జిల్లా పంచాయతీ అధికారి సంగారెడ్డి