కోహీర్, మే 18: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని కవేలి గ్రామ 65వ జాతీయ రహదారి పక్కన ఉన్న హోటల్ మేనేజ్మెంట్ కళాశాలను ఆయన పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ నిరుపేద ఎస్సీ, ఎస్టీ, బీసీ యువతకు హోటల్ మేనేజ్మెంట్లో నైపుణ్యంతో కూడిన శిక్షణ ఇవ్వాలని సూచించారు. యువతలో నైపుణ్యాన్ని పెంచి వారు సొంత కాళ్లపై నిలబడేలా తయారు చేయాలని కోరారు.
జర్మనీ, జపాన్‌లో ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉంటాయని, రెండు, మూడు నెలల్లో విద్యార్థులకు విదేశీ భాషలు నేర్పించాలని సూచించారు. శిక్షణ పొందిన నిరుద్యోగులు ఎక్కడ ఉద్యోగాలుంటే అక్కడికి వెళ్లి పనిచేయాలన్నారు. రాష్ట్రంలో కేవలం ఐదు లక్షల ఉద్యోగాలు మాత్రమే ఉంటాయని వెల్లడించారు. ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. హోటల్ మేనేజ్మెంట్ కళాశాల భవనాన్ని కార్పొరేట్ స్థాయిలో అందంగా తీర్చిదిద్దేందుకు రూ.5కోట్లు మంజూరు చేస్తున్నామన్నారు. కళాశాలల్లో ఎలాంటి కొరత లేకుండా చూడాలన్నారు.
విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా డ్వాక్రా సంఘాల మహిళలకు కూడా పలు రంగాల్లో శిక్షణ ఇవ్వాలని అధికారులకు సూచించారు. అనంతరం పర్యాటక శాఖకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. కళాశాలకు వచ్చిన మంత్రి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి వాణీప్రసాద్, సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్‌జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్, నిథమ్ డైరెక్టర్ వెంకటరమణ, ఎంపీ సురేశ్‌కుమార్ షెట్కార్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్, సెట్విన్ చైర్మన్ గిరిధర్‌రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి, సర్పంచ్‌లు నాజియాలాయిక్, విద్యాసాగర్ పాల్గొన్నారు.