అందోల్, జూలై 27: శ్రావణమాసం పవిత్రమైనది. ఈ నెలలో ఎన్నో మంచి రోజులు, విశిష్ట పండుగలు రానున్నాయి. సనాతన ధర్మంలో (హిందూ) చాంద్రమానం ప్రకారం మనకున్న పన్నెండు మాసాల్లో ఐదోది, ఎంతో పవిత్రత కలిగినది శ్రావణమాసం. ఈ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడంతో ఈ మాసానికి శ్రావణమాసం అని పేరు ఏర్పడింది. ఈ శ్రావణమాసంలోనే వర్ష రుతువు ప్రారంభమవుతుంది. త్రిమూర్తుల్లో స్థితికారుడు దుష్టశిక్షకుడు, శిష్టరక్షకుడు శ్రీమహావిష్ణువుకు, ఆయన దేవేరి(భార్య) శ్రీమహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణమాసం. వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరించడంతో విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసం శ్రావణం. శ్రీమహావిష్ణువు జన్మనక్షత్రం కూడా శ్రావణ నక్షత్రం కావడం, అలాంటి శ్రావణ నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణమాసం మహావిష్ణువు పూజకు ఎంతో ఉత్కృష్టమైన మాసం. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుంది. చేసిన వారికి సైతం ముక్తి లభిస్తుందంటారు. శ్రావణమాసంలోని దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో శ్రావణమాసం ఒకటి. ఈ మాసం శివపూజకు కూడా విశిష్టమైనది. శివ, కేశవ భేదం లేకుండా పూజించడానికి శ్రావణమాసం విశేషమైనది. ఈ మాసంలో చేసే ఏచిన్న దైవ కార్యమైనా కొన్నివేల రెట్ల శుభ ఫలితాన్నిస్తుంది.
మంగళగౌరీ వ్రతం..
శ్రావణ మాసంలో అన్ని మంగళవారాల్లో చేసే వ్రతమే మంగళగౌరీ వ్రతం. దీనిని శ్రావణ మంగళవార వ్రతం అని, మంగళగౌరీ నోము అని వివిధ రకాలుగా పిలుస్తుంటారు. ఈ వ్రతాన్ని గురించి నారదుడు సావిత్రికి, శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు వెల్లడిస్తున్నాయి. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్లయిన వారు ఆచరించాలి. వివాహమైన తర్వాత వచ్చే శ్రావణంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించాలి. శ్రావణ మాసంలో వచ్చే అన్ని మంగళవారాల్లో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి. ఐదేండ్ల పాటు మంగళగౌరీ వ్రతాన్ని ఆచరించి ఉద్వాపన చేయాలి. దీంతో వారు నిండు సుమంగళిగా ఉండడమే కాకుండా కుటుంబంలో సుఖశాంతులు,అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి.
వరలక్ష్మీ వ్రతం..
శ్రావణమాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం ఆచరించాలి. ఒకవేళ అప్పుడు వీలుకాకుంటే శ్రావణమాసంలో మరొక శుక్రవారమైనా దీనిని ఆచరించవచ్చు. పూజ మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకొని దానికి వరలక్ష్మీదేవి ముఖప్రతిమను అలంకరించి పూజ చేయాలి. తర్వాత తొమ్మిది ముడులతో తోరణాన్ని తయారు చేసి, పూజచేసిన అనంతరం ఈ కింది శ్లోకాన్ని పఠించాలి.
“శ్లోకం : బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం
పుత్ర పౌత్రాభివృద్ధించ దేహిమే రమే ” ..అని పటిస్తూ తోరణాన్ని చేతికి కట్టుకోవాలి. మంత్రాలు శ్రవణం చేస్తూ ముత్తయిదువులకు వాయినాలు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఈ వ్రతం స్వయంగా శివుడు పార్వతీదేవికి సూచించి సౌభాగ్యం, మంగళ్య బలాన్ని వివరించినట్లు ప్రసిద్ది.
శ్రావణ మాసం.. విశిష్టత సమాహారం..
శుక్లపక్ష ద్వాదశి, దామోదర ద్వాదశి అని ఈ మాసంలో రెండు శుభ దినాలున్నాయి. శుక్లపక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మహావిష్ణువును పూజిస్తే మోక్షం లభిస్తుందంటారు. శ్రావణమాసం వర్ష రుతువులో వస్తుంది. ఆరోగ్యం కోసం ఈ మాసంలో మహిళలు కాళ్లకు పసుపు పెట్టుకోవాలని ఇంటి ముందు గడపకు పసుపు, కుంకుమలతో అలంకరించాలని, ఇంట్లో తులసికోట ముందు ఉదయం, సాయంత్రం దీపారాధన చేయాలని, ఉపవాస దీక్ష పాటించాలని పెద్దలు చెబుతారు. శ్రావణం.. శుభకరం
శ్రావణమాసం ఎంతో శ్రేష్ఠం..
శ్రావణ మాసంలో చేసే పూజా కార్యక్రమాలు ఎంతో శ్రేష్ఠమైనవి. ఈ మాసంలో వచ్చే పండుగలు, ప్రత్యేక రోజులకు పురాణాల్లో గొప్ప విశిష్టత ఉంది. మహా విష్ణువు, శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణమాసం. ప్రతి ఒక్కరూ ఈ మాసంలో ఆచరించే నోములు, పూజలకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది.భక్తి శ్రద్ధలు,నియమ నిష్టలతో ఆచరించే పూజలతో భగవంతుడి కృపకు పాత్రులవుతారు.
– శీలం కోట ప్రవీణ్శర్మ, పురోహితులు
ప్రతిరోజూ ప్రత్యేకమే..
శ్రావణమాసంలో వచ్చే ప్రతిరోజుకు ఎంతో విశిష్టత ఉంది. ఈ మాసాంతం శ్రావణ నక్షత్రం ఉండటమే దీనికి కారణమని పండితులు చెబుతారు.
సోమవారం ఈ మాసంలో వచ్చే సోమవారానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. ముక్తి ప్రదాత ముక్కంటి ఈశ్వరునికి ప్రీతికరమైన రోజు, శివానుగ్రహం కోసం బిల్వపత్ర పూజలు, రుద్రాభిషేకాలు, పంచామృత పూజలు, శివకల్యాణం ఆచరిస్తే దోషాలు తొలుగుతాయని భక్తుల విశ్వాసం.
మంగళవారం
ఆభయం ఇచ్చే ఆంజనేయస్వామి, సకల విజ్ఞాలు తొలిగించి తొలి పూజలందుకునే వినాయకుడు, సంతాన భాగ్యాన్ని కలిగించే సుబ్రహ్మణ్యస్వామి మంగళవారం నాడే జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రావణ మంగళగౌరీ వత్రాన్ని ఆచరిస్తే మహిళలకు ఆఖండ సౌభాగ్యం, కుటుంబ సౌక్యం తదితర శుభాలు కలుగుతాయని నమ్మకం
బుధవారం
బుద్ధికి కారకుడు బృహస్పతి, బృహస్పతికి ఇష్టమైన వారం బుధవారం, ఆత్మవిశ్వానికి ప్రతీకైన ఈ రోజున అయ్యప్పస్వామి ఆరాధన సకల జన్మనక్షత్ర దోషాలను తొలిగిస్తుందని ప్రజలు నమ్ముతారు.
గురువారం
గురు అనుగ్రహం కోసం అజ్ఞానాన్ని తొలిగించే జ్ఞాననేత్రాలు ప్రసాదించే దక్షిణామూర్తి, షిర్డీ సాయిబాబా, గురు రాఘవేంద్ర స్వాములకు ఇష్టమైన వారం. ఈ రోజున అన్నదానం, గోమాతకు దాణా సమర్పిస్తే గురు అనుగ్రహం కలుగుతుంది.
శుక్రవారం
శ్రావణమాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. వ్యాపారంలో నష్టం, భార్యాభర్తల కలహాలు, దారిద్య్రం తొలిగిపోవడానికి వరలక్ష్మీవ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే లక్ష్మీకటాక్షం కలుగుతుందని భక్తుల విశ్వాసం
శనివారం
కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామికి శ్రావణ శనివారం ఇష్టమైన రోజు, తులసీదళాలు, ఆవునెయ్యి దీపాలతో స్వామిని పూజిస్తే సకల శనిదోషాలు తొలుగుతాయని విశ్వాసం.
ఆదివారం
ఆరోగ్య ప్రదాత సూర్య భగవానుడు. శ్రావణ మాసంలో వచ్చే ఆదివారం నాడు సూర్యునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తే ఆరోగ్య భాగ్యం కలుగుతుందని భక్తులు ప్రగాఢ నమ్మకం.
మహాలక్ష్మికి ప్రీతికరమైన మాసం శ్రావణం. వర్షాలు, పంటలు, పండుగలకు ప్రతీకగా నిలుస్తోంది ఈ మాసం. విష్ణుమూర్తి జన్మనక్షత్రమైన శ్రావణ పేరుతో ప్రారంభమైన ఈ మాసంలో వచ్చే ప్రతి మంగళ, శుక్రవారాలను మహిళలు ఇష్టంగా భావిస్తారు. ఈ రోజుల్లో ఉదయాన్నే తలస్నానం చేసి అమ్మవారిని పూజించడం సంప్రదాయం. ఈ మాసంలోనే ఉపవాస దీక్షలు చేస్తారు. శ్రావణ మాసమంతా పండుగలే ఉంటాయి. మొదటగా సర్ప, రాహు దోషాలు పోవాలని వేడుకుంటూ నాగులచవితి, నాగుల పంచమి నిర్వహిస్తారు. సౌభాగ్యాలు, సిరిసంపదలు కలగాలని శుక్రవారం వరలక్ష్మీవ్రతం, సౌభాగ్యం కోసం మంగళవారం మంగళగౌరీ వ్రతం ఆచరిస్తారు. రాఖీ పౌర్ణమి, కృష్ణాష్టమి, పాడిపంటలు, పశు సంపదలు బాగుండాలని పొలాల అమావాస్య తదితర పండుగలను ఈ మాసంలో జరుపుకొంటారు.