పటాన్చెరు, మార్చి 28: ఆహార భద్రతకు ఇక్రిశాట్ పరిశోధనలు దోహదం చేస్తున్నాయని ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాంశు పాఠక్ అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన సంస్థ ఇక్రిశాట్ 53వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ జనరల్ హిమాంశు పాఠక్ మాట్లాడుతూ ఇక్రిశాట్ పేద దేశాల్లో ఆహార సంక్షోభ నివారణకు వ్యవసాయంలో విప్లవాత్మక మార్పుల కోసం పరిశోధనలు చేస్తుందన్నారు. 28 మార్చి 1972లో ఇక్రిశాట్ ఏర్పాటైందన్నారు. నిరంతర పరిశోధనలతో ఈ యాభై ఏండ్లలో 12వందల రకాల వంగడాలు కనుక్కొని రైతులకు అందజేశామన్నారు. డ్రైల్యాండ్స్ శరవేగంగా విస్తరిస్తుండటం ఇక్రిశాట్‌కు, ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతున్నదన్నారు. వాతావరణ మార్పు లు మరోపక్క వ్యవసాయ ఉత్పత్తులను తగ్గిస్తున్నాయన్నారు.
ఒక్క డిగ్రీ టెంపరేచర్ పెరిగితే పంట ఉత్పాదకత తగ్గుతుందన్నారు. పేద దేశాల్లో వ్యవసాయంలో మార్పులు రాకపోవడంతో ఆహారధాన్యాల ఉత్పత్తి అనుకున్న స్థాయిలో పెరగడం లేదన్నారు. శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేసి తయారు చేసిన నూతన వంగడాలు పేద దేశాల్లోని రైతులకు అందించేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలన్నారు. వాతావరణ మార్పులతో భూములు నిస్సారంగా మారుతున్నాయన్నారు. భూముల్లో పోషకాలు పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. వర్షాభావ పరిస్థితులతో పేద దేశాలు సతమతమవుతున్నాయన్నారు.
వర్షాభావ పరిస్థితుల్లో పండే రకాలు, మిల్లెట్స్, ఇతర ధాన్యాలను రైతులు పండించేందుకు కృషి చేస్తున్నామన్నారు. రెండేళ్ల క్రితం భారత్ సూచనపై మిల్లెట్స్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రాచూర్యంలోకి తీసుకొచ్చేందుకు మిల్లెట్స్ ఇయర్‌గా ప్రకటించామన్నారు. కొన్ని చోట్ల అతివృష్టి కూడా సమస్యలు సృష్టిస్తున్నదన్నారు. వీటిని అధిగమించేందుకు ఏఐ, టెక్నాలజీ, సైన్స్ సహాయం తీసుకోవాలన్నారు. వ్యవసాయంలో ఆఫ్రికా దేశాలు చాలా వెనకబడి ఉన్నాయని, ఆ దేశాలు పోషకాహార లోపంతోనూ బాధపడుతున్నాయన్నారు. వారికి తమ పరిశోధనలు ఎంతో అండగా నిలుస్తాయన్నారు.
భారతదేశం కూడా వ్యవసాయరంగంలో అనేక సవాళ్లను ఎదుర్కొంటుందన్నారు. ఇక్రిశాట్ పరిశోధనలు ఇండియా రైతాంగానికి సహాయకంగా ఉన్నాయన్నారు. భారత్‌లోని వ్యవసాయ పరిశోధన సంస్థలతో, ప్రభుత్వాలతో ఇక్రిశాట్ అనేక ప్లాట్‌ఫాంలపై కలిసి పనిచేస్తుందన్నారు. తెలంగాణ రైతులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామన్నారు. నూతనంగా వస్తున్న వ్యవసాయ పరిశోధనలన్నింటినీ ఒకచోటకు తెస్తే అనేక సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయన్నారు. యాబై మూడేండ్ల ఇక్రిశాట్ ప్రయాణంలో ఎన్నో విజయాలు, ఎన్నో సవాళ్లు ఎదుర్కున్నామన్నారు. భవిష్యత్తు ఆహార సంక్షోభాలకు దీటుగా ఎదుర్కునేందుకు ఎన్నో నిరంతరం పరిశోధనలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ స్టాన్‌ఫర్డ్ బ్లేడ్, డైరెక్టర్ కమ్యూనికేషన్ రేమండ్ పీచే, శాస్త్రవేత్తలు డాక్టర్ మాంగీలాల్ జాట్, డాక్టర్ సంజయ్ అగర్వాల్, షాన్మేజ్ ఉన్నారు.