Jeevamrutham | రామాయంపేట, జూన్ 10 : రైతులు వ్యవసాయంలో ఆధునిక పరిజ్ఙానాన్ని అలవర్చుకోవాలని వ్యవసాయశాఖ శాస్త్రవేత్తలు డా. ప్రతాప్‌రెడ్డి, డా.భాస్కర్, డా.గౌతమిలు పేర్కొన్నారు. మంగళవారం రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామానికి విచ్చేసిన కృషి విజ్ఙాన కేంద్రం తునికి శాస్త్రవేత్తలు రైతులకు వ్యవసాయ పంటల దిగుబడిపై అవగాహన చేపట్టారు.
రైతులు ముందుగా తన వ్యవసాయ పొలాన్ని దుక్కి దున్ని సారవంతం చేసి జీవన ఎరువులైన పచ్చిరొట్ట, జీలుగ, జనుము విత్తనాలను విత్తుకోవాలన్నారు శాస్త్రవేత్తలు. అనంతరం రైతులకు పంటలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. ప్రతి రైతు పంటలో విత్తనాలు విత్తుకునే ముందు దుక్కిని కలియ దున్నితే దిగుబడి బాగుంటుందన్నారు. పంటలకు సేంద్రీయ ఎరువులైన జీవామృతం వాడితే తక్కువ ఖర్చుతో పంటల దిగుబడి అధిక సంఖ్యలో వస్తుందన్నారు.
రైతులు విత్తనాలు కొనే ముందు జాగ్రత్తలు వహించాలన్నారు. అనంతరం శాస్త్రవేత్తలు కేంద్రప్రభుత్వం రైతుల కోసం నూతన పద్దతులను ప్రవేశ పెట్టిందని వాటిని రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట వ్యవసాయశాఖ డివిజన్ ఇంచార్జి సహాయ సంచాలకులు రాజ్‌నారాయణ, అంతర్జాతీయ సంస్థ ప్రతినిధులు మధు మంజరి, ఏఈవోలు ప్రవీణ్, సాయికృష్ణ కోనాపూర్ రైతులు కరికె విద్యాసాగర్, మామిడి సిద్దిరాములు పాల్గొన్నారు.