పటాన్చెరు రూరల్, ఫిబ్రవరి 13 : సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ కౌంటింగ్ కేంద్రం ముందు ఉద్రిక్తత ఏర్పడింది. శుక్రవారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ జడ్పీహెచ్ స్కూల్లో జరిగింది. ఫలితాల్లో 26 స్థానాలకు బీఆర్ఎస్కు 12 స్థానాలు వచ్చాయి. కాంగ్రెస్‌కు 10 స్థానాలు, ఇండిపెండెంట్లకు 4 స్థానాలు వచ్చాయి. బీఆర్ఎస్ రెబెల్‌గా గెలిచిన ఇద్దరు అభ్యర్థులు ధ్రువపత్రాలు తీసుకుని బయటకు వచ్చిన సమయంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉంచిన కార్లలో వారిని పోలీసుల ముందే బలవంతంగా ఎక్కించుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు కూడా కాంగ్రెస్ నాయకులు ఇండిపెండెంట్ అభ్యర్థులను సునాయాసంగా తీసుకెళ్లేలా కార్లకు దారిచ్చారు. అప్పటికప్పుడు తేరుకున్న బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ అల్లరిమూకలను ప్రతిఘటించారు.
బీఆర్ఎస్కు మద్దతు తెలుపుతున్న ఇద్దరు ఇండిపెండెంట్లను కాంగ్రెస్ మూకలనుంచి కాపాడుకొని బీఆర్ఎస్ నాయకుల వాహనాల్లోకి ఎక్కించారు. ఇదే సందర్భంగా బీఆర్ఎస్ మద్దతు తెలిపిన 13వ వార్డు అల్లంరెడ్డి లక్ష్మీని బీఆర్ఎస్ కార్లలో కూర్చోబెడుతున్న సందర్భంలో పోలీసు అధికారులు వచ్చి ఆమెను ప్రశ్నించారు. తాను స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీ వైపుగా వెళ్తున్నానని, తాను సేఫ్‌గానే ఉన్నానని తెలపడంతో పోలీసులు వెనుదిరిగారు. మరో అభ్యర్థిని భర్తను కాంగ్రెస్ శ్రేణులు బలవంతంగా తమ కార్లలోకి ఎక్కించునే ప్రయత్నం చేయగా, బీఆర్ఎస్ నాయకులు గట్టిగా ప్రతిఘటించారు. పోలీసులు కూడా కాంగ్రెస్ వర్గాలు ఇండిపెండెంట్లను తీసుకుని వెళ్లేలా వాహనాల వద్ద దారిని వదులుతుండటంతో బీఆర్ఎస్ వర్గాలు ఆగ్రహంతో పోలీసులను నిలదీశారు.
బీఆర్ఎస్ పార్టీ మండల ఇన్చార్జి గడీల శ్రీకాంత్‌గౌడ్, మెరాజ్‌ఖాన్ పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. సందర్భంగా పెద్ద ఎత్తున తోపులాట చోటుచేసుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాలు బాహాబాయికి పాల్పడ్డారు. ఈ గొడవ ఉద్రిక్తతకు దారితీస్తుండడంతో పోలీసు బలగాలు ఇరువర్గాలను బలవంతంగా అక్కడినుంచి పంపించివేశారు. స్వల్ప లాఠీచార్జీని సైతం చేశారు. ఈ లాఠీచార్జీలో ఇద్దరు బీఆర్ఎస్ కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి. ఇండిపెండెంట్లు తమ కుటుంబ సభ్యుల సమక్షంలో కార్లలోకి ఎక్కి వెళ్లిపోయారు. కాంగ్రెస్ నాయకుల అనుచరులు ఇండిపెండెంట్ అభ్యర్థుల ఇండ్ల వద్ద వారి కిడ్నాప్ ప్రయత్నాలు చేశారని ఆరోపణలు ఉన్నాయి.