సిద్దిపేట, జూలై 22: సిద్దిపేట జిల్లాలో మంగళవారం రేషన్‌కార్డుల పంపిణీ రసాభాసగా మారింది. సిద్దిపేట కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులకు జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ చేత రేషన్‌కార్డులు పంపిణీ చేసేందుకు మంగళవారం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానం మేరకు ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బకి వెంకటయ్య హాజరయ్యారు.
వేదికపైన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బకి వెంకటయ్యకు సీట్ కేటాయించకపోవడంతో ఎమ్మెల్యే హరీశ్‌రావు అధికారులపై గరం అయ్యారు. దీంతో అధికారులు హుటాహుటిన వేదికపైన కుర్చీ ఏర్పాటు చేశారు. లబ్ధ్దిదారులకు కనీసం తాగు నీళ్లు ఇవ్వరా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఫొటోను ఫ్లెక్సీలో ఎందుకు పెట్టలేదని సమావేశం ప్రారంభంలో దుబ్బాక బీఆర్ఎస్ శ్రేణులు అభ్యంతరం తెలిపారు. దీంతో కలెక్టర్ దుబ్బాక నియోజకవర్గానికి సంబంధించి రేషన్ కార్డులు ఈరోజు పంపిణీ చేయడం లేదని,దుబ్బాకలో ప్రత్యేకంగా కార్యక్రమం ఏర్పాటు చేస్తామని చెప్పారు.
దీంతో తనకు ఎందుకు ఆహ్వానం పంపారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అధికారులను ప్రశ్నించారు. దీంతో కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేయగా, బీఆర్ఎస్ నాయకులు పోటీగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేస్తూ వేదిక వైపు దూసుకు వచ్చే ప్రయత్నం చేశారు. దీంతో సమావేశ ప్రాంగ ణం గందరగోళంగా మారింది. అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలుపడంతో పోలీసులు వారిని బలవంతంగా సమావేశం నుంచి బయటకు లాకెళ్లారు. కాంగ్రెస్ కార్యకర్తలను మాత్రం బుజ్జగిస్తూ అక్కడే కూర్చోబెట్టారు. కాంగ్రెస్ నాయకులను బయటకు తీసుకెళ్లాలని బీఆర్ఎస్ నాయకులు చెప్పినా వినకుండా పోలీసులు వారిని సమావేశం మందిరంలోనే కూర్చోబెట్టారు.
మంత్రి హెచ్చరికలు
రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి వివేక్ మాట్లాడుతుండగా.. గొడవ చేస్తున్న వారు సైలెంట్‌గా కూర్చోవాలని, లేదంటే బయట పంపిస్తానని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ప్రసంగిస్తున్నప్పుడు ఎంతమందికి రుణమాఫీ అయ్యిందో చెప్పాలని, ఇందిరమ్మ ఇండ్లు అందరికీ రాలేవని బీఆర్ఎస్ కార్యకర్తలు నిలదీయడంతో మళ్లీ రచ్చ అయ్యింది. ఎమ్మెల్యే హరీశ్‌రావు కల్పించుకొని బీఆర్ఎస్ కార్యకర్తలను సముదాయించారు. కాంగ్రెస్ కార్యకర్తలను గొడవ చేయొద్దని మంత్రి వివేక్ చెప్పినా వవారు వినకుండా పదేపదే నినాదాలు చేయడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ చేయాలి
సిద్దిపేట, జూలై 22: రేషన్ కార్డుల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యంలో 40 నుంచి 50శాతం నూకలు ఉంటున్నాయని, దొడ్డు బియ్యాన్ని పాలిష్ చేసి సన్న బియ్యంగా పంపిణీ చేస్తున్నారని మాజీ మంత్రి,సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట జిల్లాలో ప్రజల నుంచి పెద్ద మొత్తంలో ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు.
ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నాణ్యమైన సన్నబియ్యాన్ని పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒకేసారి పంపిణీ చేసిన 3నెలల కోటా సన్న బియ్యంలో నాణ్యత లోపించడంతో లబ్ధిదారులు తినలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ కార్డుల పంపిణీ అనేది నిరంతర ప్రక్రియ అని, ఏ ప్రభుత్వం ఉన్నా కొత్త కార్డులు ఇస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 6,47,479 రేషన్ కార్డులు మంజూరు చేసిందని గుర్తుచేశారు. గతంలో కార్డు మీద నాలుగు కేజీల బియ్యం ఇస్తే, బీఆర్ఎస్ ఆరు కేజీల బియ్యం కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చిందన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో సన్న బియ్యం అందించి, విద్యార్థుల కడుపు నింపినట్లు గుర్తుచేశారు. కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారికి కూడా ఈనెల నుంచే సన్నబియ్యం అందించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్‌లో నాణ్యమైన బియ్యాన్ని ప్రజలకు అందించాలన్నారు. పార్టీలకతీతంగా జిల్లా అభివృద్ధికి కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ కె.హైమావతి, అదనపు కలెక్టర్లు అబ్దుల్ హామీద్, గరిమా అగర్వాల్, డీఎస్వో తనూజ, ఆర్డీవో సదానందం, మున్సిపల్ చైర్పర్సన్ మంజులా రాజనర్సు పాల్గొన్నారు.