సిద్దిపేట, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట,మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. జిల్లాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న మంత్రులు దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్‌కు కనిపించడం లేదా..? అని ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల భారీ వర్షాలు, వరదలతో మెదక్ జిల్లా అతలాకుతలం అయ్యింది. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న సమయంలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వేల ఎకరాల్లో పంటలకు నష్టం జరిగింది. వరి పొలాలు ఇసుక మేటలతో నిండిపోయాయి.
పత్తి పంటలు నాశనమయ్యాయి. రహదారులు ధ్వంసమయ్యాయి. బ్రిడ్జిలు కూలిపోయాయి. నిత్యం జిల్లాల్లో యూరియా కోసం రైతులు కొట్టుకుంటున్నారు. ఇది మీకు కనిపించడం లేదా..? ఒక్క రోజైనా యూరియా మీద మంత్రులు సమీక్ష నిర్వహించారా..? అంటే అది లేదు. ఇప్పటికే చాలా వరకు యూరియా అందక పొలాలు ఎర్రబారుతున్నాయి. వ్యవసాయ పనులు పక్కన పెట్టి రైతులు రోడ్ల మీదనే ఉంటున్నారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్యం పడకేసినా పట్టించుకోవడం లేదు. ఫలితంగా గ్రామాల్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి.
డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.. ఇలా సమస్యలు జిల్లాల్లో నెలకొన్నా కనీసం మంత్రులు వీటి మీద సమీక్షలు చేసిన పాపాన పోలేదు. ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ జిల్లాకు రావడమే మానేశారు. గత నెలలో కురిసిన భారీ వర్షాల సమయంలో ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సొంత నియోజకవర్గం అందోల్కే ప్రాధాన్యం ఇస్తున్నారు. రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సొంత నియోజకవర్గం హుస్నాబాద్‌కే పరిమితమయ్యారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పారిశుధ్యం పడకేసింది. ఇటీవల కురిసిన వర్షాలకు ఎక్కడి చెత్త కుప్పలు అక్కడే ఉన్నాయి.గ్రామాలు,పట్టణాల్లోని పలు కాలనీల్లో చెత్తాచెదారం, వరదలతో వచ్చిన మట్టి కుప్పలు అలానే ఉన్నా యి.ప్రభుత్వం గ్రామాలను పట్టించుకోక పోవడంతో రోజు రోజుకూ జ్వరాల బారిన పడిన వారి సంఖ్య పెరుగుతోంది. డెంగీ, టైఫాయిడ్, ఒళ్లు నొప్పులు తదితర వాటితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రహదారుల వెంబడి, మోరీల వెంట గడ్డి విపరీతంగా పెరగడంతో పాటు లోపించిన పారిశుధ్యంతో పల్లెలు దర్శనమిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించి అందుకు తగ్గట్టుగా నిధులు విడుదల చేసి గ్రామాలను శుభ్రంగా ఉంచింది.
దీంతో గ్రామాలు శుభ్రంగా ఉండడంతో జ్వరాలు రాలేదు. తక్కువ సంఖ్యలో మాత్రమే కేసులు నమోదయ్యాయి. ఇవ్వాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలను పట్టించుకోక పోవడంతో చాలాగ్రామాలు, తండాలు మంచంపట్టాయి. రోజు రోజుకూ జ్వరాలు విజృంభిస్తున్నాయి.వీధులు అపరిశుభ్రంగా మారడంతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. డెంగీ కేసులు భారీగా నమోదవుతున్నాయి. జ్వరాలతో గిరిజన తండాలు వణికిపోతున్నాయి. తాగునీరు సక్రమంగా సరఫరా చేయడం లేదు. పైప్‌లైన్ లీకేజీలు, వాటర్ ట్యాంకులు అపరిశుభ్రంగా ఉండడంతో తాగునీటి కలుషితమవుతుంది.
ఆగస్టులో ఎన్నడూ లేని విధంగా కురిసిన వర్షాలతో పంటలకు భారీగా నష్టం జరిగింది. వరి, మొక్కజొన్న, పత్తి,తదితర పంటలకు అపార నష్టం జరిగిన విషయం తెలిసిందే. వర్షాలు కురిసిన రోజు చుట్టపు చూపులా ఒక రోజు ఇలా వచ్చి అలా వెళ్లిపోయిన మంత్రులు మళ్లీ రైతుల గురించి పట్టించుకున్న సందర్భం లేదు. జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ ఇంత వరకు జిల్లాలో వర్షాల వల్ల నష్టపోయిన పంటలు, దెబ్బతిన్న రోడ్లు, ఇతర సమస్యలపై రివ్యూ పెట్టిన సందర్భం లేదు.
ఆరోజు మెదక్‌లో తొలుత అధికారులతో సమావేశం నిర్వహించి అక్కడి నుంచి వరదలతో నష్టపోయిన కొన్ని ప్రాంతాలను సందర్శించి వెళ్లారు. రైతులను ఆదుకుంటామని చెప్పారు కానీ ఇప్పటి వరకు ఏంచేయలేదు. పంటనష్టంపై రివ్యూ పెట్టి రైతులకు పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. ప్రభుత్వం పరిహారం అందిస్తదేమో అని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
భారీ వర్షాలతో సిద్దిపేట, మెదక్ సంగారెడ్డి జిల్లాలో పలు రోడ్లు, లోలెవల్ వంతెనలు దెబ్బతిన్నాయి. పంచాయతీరాజ్‌శాఖ, రోడ్లు భవనాలశాఖలు వేర్వేరుగా తమశాఖ పరిధిలో ఏమేరకు నష్టపోయిందో తాత్కాలికంగా, శాశ్వత నిర్మాణాలకు ఏ మేరకు నిధులు అవసరం అవుతాయే అంచనాలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం. వెంటనే ప్రభుత్వానికి పంపిన నివేదికల ఆధారంగా జిల్లాలకు నిధులు మంజూరు చేయించాలని మంత్రులను ఉమ్మడి జిల్లాలోని ప్రజలు కోరుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో డెంగీ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలంలోని తిమ్మాపూర్‌లో ఇద్దరు యువకులు డెంగీతో చనిపోయారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని తునికి గ్రామంలో విషజ్వరాలతో ఇద్దరు విద్యార్థులు చనిపోయారు.ప్రధానంగా జిల్లాలో ప్రజలు జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు. కొందరికి ఒళ్లు నొప్పులు, దురదలు ఉంటున్నాయి. మెదక్ జిల్లాలో 25వేలకు మంది కి పైగా జ్వరాలు, 25 డెంగీ కేసులు, 90 మందికి టైఫాయిడ్ వచ్చింది.సిద్దిపేట జిల్లాలో 43,254 మంది వివిధ రకాల జ్వరాలతో బాధపడుతున్నారు.
వీరిలో 60 మందికి డెంగీ, 140 మందికి టైఫాయిడ్,1510 మందికి డయేరియా, మిగతా వాళ్లు జలుబు, దగ్గు, ఇతర వ్యాధులతో బాధపడుతున్నారు.సంగారెడ్డి జిల్లాలో జ్వరంతో 2,725 మంది,డెంగీతో 149 మంది, మలేరియాతో 10, టైఫాయిడ్‌తో 358 మంది బాధపడుతున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ దవాఖానల్లో నాణ్యమైన సేవలు అందడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రైవేట్ దవాఖానలను ఆశ్రయిస్తున్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ప్రైవేట్ దవాఖాల వాళ్లు అందినకాడికి దోచుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగారెడ్డి జిల్లాలోనే ప్రైవేట్ దవాఖానల ఆగడాలు మితిమీరుతున్నాయి. ఇంత జరుగుతున్నా పట్టించుకునే వారు కరువయ్యారు.