నర్సాపూర్,మార్చి 21 : నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డితో సహా 11 మందిపై కేసును హైకోర్టు కొట్టివేసిందని న్యాయవాది కొల్కూరి అఖిల్‌రెడ్డి తెలిపారు. వెల్దుర్తి మండలం శెట్పల్లి హల్దీవాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని 2018 జూన్ 2న వెల్దుర్తి అంబేద్కర్ చౌరస్తాలో వాహనాలను ఆపి ధర్నా నిర్వహించగా, వెల్దుర్తి పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డితో పాటు తలారి మల్లేశం, తలారి హన్మేశ్, శ్రీనివాస్‌రెడ్డి, షేకాగౌడ్, జైరాంరెడ్డి, శ్రావణ్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి, పడిగె నర్సింహులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మెదక్ జూనియర్ సివిల్ కోర్టు నుంచి నాంపల్లి కోర్టుకు కేసును బదిలీ చేశారు. అక్కడ కేసు పెండింగ్‌లో ఉండడంతో హైకోర్టులో సీనియర్ అడ్వకేట్ జనార్దన్‌రెడ్డి తనయుడు అడ్వకేట్ కొల్కూరి అఖిల్‌రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటీషన్ వేశారు. విచారించిన హైకోర్టు జడ్జి ఎం.లక్ష్మణ్ ఈ కేసును కొట్టివేశారు. ఈ కేసులో ఉన్న ముప్పిడి జయరాంరెడ్డి ఇటీవల మృతిచెందారు. కేసు కొట్టివేయడంతో ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.