సిద్దిపేట, మే 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట జిల్లాలో మూడు రోజలుగా ఈదురుగాలులు, అకాల వర్షాలకు వందలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. మామిడి తోటల్లో కాయలు నేలరాలడంతో పాటు చెట్లు విరిగాయి. కొనగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం రాశులు తడిసి వర్షం నీటిలో కొట్టుకుపోయాయి. విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆరుగాలం కష్టించి పండించిన రైతుకు కునుకు లేకుండా పోయింది. చేతికి వచ్చిన పంట అకాల వర్షంతో చేజారడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.
ఈదురుగాలులకు రైతులు ఆగమాగమవుతున్నారు. ఆరు నెలల కష్టం వర్షపునీటిలో కొట్టుకుపోయింది. కొన్ని గ్రామాలు చెరువులను తలపిస్తున్నాయి. మామిడి తోటల్లో కాయలు నేల రాలి చెట్లు నేల కొరిగాయి.. బలమైన ఈదురు గాలులు వీయడంతో విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగి పడ్డాయి. గంటల తరబడి విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
సిద్దిపేట జిల్లాలో మూడు రోజులుగా రాత్రి బలమైన గాలులు వీయడంతో పాటు వర్షం కురవడంతో భారీ నష్టం జరిగింది. సిద్దిపేట,దుబ్బాక, గజ్వేల్, జనగామ, హుస్నాబాద్, నియోజకవర్గాల్లో వరి, మామిడి పంటలకు భారీ నష్టం జరిగింది.ఇంత జరిగినా రాష్ట్ర ప్రభత్వం, జిల్లాకు చెందిన మంత్రులు కనీసం పట్టించుకోకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. కనీసం తాము ఉన్నామని భరోసా కూడా జిల్లా మం త్రులు ఇవ్వడం లేదు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
15 వేల ఎకరాల్లో పంటలకు నష్టం
సిద్దిపేట జిల్లాలో మూడు రోజలుగా వీస్తున్న ఈదురుగాలులు,అకాల వర్షాలకు దాదాపు 15 వేల ఎకరాలకు పైగా పంటలకు నష్టం జరిగినట్లు సమాచారం. సోమవారం సాయంత్రం వరకు జిల్లాలో 10 వేల ఎకరాల్లో నష్టం జరిగింది. సోమవారం రాత్రి కురిసిన వర్షానికి ఆనష్టం మరింత పెరిగింది. దాదాపు జిల్లాలో 15 వేల ఎకరాల్లో వరి పంటకు నష్టం జరిగింది.
మామిడి తోటల్లో కాయలు పూర్తిగా నేల రాలడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మామిడి కాయలు రాలడంతో పాటు చెట్లు నెలకొరిగాయి. ప్రధానంగా సిద్దిపేట అర్బన్, రూరల్, చిన్నకోడూరు, నంగునూరు, దుబ్బాక, రాయపోల్, దౌల్తాబాద్, తొగుట, కొండపాక, కుకునూరుపల్లి, చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, హుస్నాబాద్,అక్కన్నపేట, కోహెడ మండలాల్లో ఈదురుగాలులు వీచాయి. పిడుగులకు పశువులు చనిపోయాయి. బలమైన గాలులతో రేకులు, కోళ్లఫారాలు లేచి పో యాయి.
రైతులకు భరోసా ఇవ్వని ప్రభుత్వం
జిల్లాలో రెండు మూడు రోజులుగా బలమైన ఈదురుగాలులు వీచి పంటలకు నష్టం జరిగినా జిల్లాకు చెందిన మంత్రులు కనీసం రైతుల వైపు చూడడం లేదు.జిల్లా ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ, జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ కనీసం రైతులను ఓదార్చడం లేదు. రైతుల గురించి పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి సోమవారం సుడిగాలి పర్యటనలు చేసి రైతులకు ధైర్యం చెప్పారు.
తాము ఉన్నామని భరోసా కల్పించారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రైతుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. రైతు భరోసా లేదు, పంట రుణమాఫీ పూర్తిగా చేయలేదు. ఇవ్వాళ అకాల వర్షాలతో పంటలు నష్టపోతే కన్నెత్తి చూడడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.