గుమ్మడిదల, జూలై 27: బొంతపల్లి పారిశ్రామికవాడలోని రహదారుల పక్కన దారిపొడవున భారీ వాహనాలు నిలపుతుండడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ప్రమాదాలు సైతం చోటుచేసుకుంటున్నాయి. పరిశ్రమలకు వచ్చే భారీ వాహనాలు నిలపడానికి పరిశ్రమల్లో 10శాతం స్థలం పార్కింగ్ కోసం కేటాయించాలన్న నిబంధనలు అమలు కావడం లేదు.
సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదల మండలంలోని బొంతపల్లి పారిశ్రామికవాడలో గ్రాన్యూవల్ ఇండియా లిమిటెడ్ పరిశ్రమకు చెందిన భారీ వాహనాలు రహదారికి ఇరువైపులా పార్కింగ్ చేస్తుండడంతో వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులకు ఎదురవుతున్నా యి.
ఈ దారి మీదుగా బొంతపల్లి కమాన్ నుంచి వివిధ పరిశ్రమలకు డ్యూటీలకు వెళ్లే కార్మికులకు, జిన్నారం మండల కేంద్రానికి పోయే వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తున్నది. ఈ దారి మీదు గా భారీ వాటర్ ట్యాంకుల వాహనాలు, ట్రాక్టర్లు, ఆటోలు, బస్సులు, బైక్లు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో పార్కింగ్ చేసిన వాహనాలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.