తిరుమలగిరి, ఆగస్ట్టు 12 : తిరుమలగిరి మండలంలో సోమవారం అర్ధ్దరాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలు జలమయయ్యాయి. ఇండ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు చాలా ఇబ్బందుల పడ్డారు. మండల పరిధిలోని తొండలో 180 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మంగళవారం తొండ గ్రామాన్ని సందర్శించారు. ఇండ్లలో చేరిన వరద నీటిని పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందలు కలుగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా హెల్త్ క్యాంపు నిర్వహించాలన్నారు. కలెక్టర్ వెంట తహసీల్దారు హరిప్రసాద్, ఎంపీడీవో లాజర్, ఎంపివో భీమ్‌సింగ్, పంచాయతీ కార్యదర్శి యాకుబ్‌రెడ్డి ఉన్నారు.
తుంగతుర్తిలో..
తుంగతుర్తి నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. వర్షపు నీటితో చెరువులు, కుంటలు నిండాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పంట పొలాలు నీటమునిగాయి. కలెక్టర్ నియోజక వర్గంలోని పలు మండలాలల్లో పర్యటించారు. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నాగారం మండలంలో 190.3 మి.మీ, తుంగతుర్తి మండలంలో 136.0 మి.మీ, జాజిరెడ్డిగూడం మండలంలో 123.3 మి.మి, తిరుమలగిరి మండలంలో 96.0 మి.మీ, నూతనకల్ మండలంలో 79.0 మి.మీ, మద్దిరాల మండలంలో 69.5 మి.మీ వర్షం కురిసింది.
ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ నది
భూదాన్ పోచంపల్లి, ఆగస్టు 12 : నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మూసీ ఉధృతంగా ప్రవహిస్త్తోంది. భూదాన్ పోచంపల్లి మండలంలోని జూలూరు – రుద్రెల్లిలో లెవెల్ బ్రిడ్జిపై నుంచి నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పరిసర గ్రామాల ప్రజలు బీబీనగర్ భువనగిరి వెళ్లేందుకు పెద్ద రావులపల్లి బట్టుగూడం మీదుగా సుమారు 15 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. బ్రిడ్జి వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు.
అర్వపల్లిలో..
అర్వపల్లి, ఆగస్టు 12: అర్వపల్లిలో భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలైన అర్వపల్లి సంత, జడ్పీహెచ్ఎస్ కేజీబీవీ వరద నీటిలో మునిగాయి. ఇండ్లల్లోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు గ్రామాల్లో వరి పంట నీట మునిగింది. కేజీబీవీ విద్యార్థులను ట్రాక్టర్ ద్వారా బయటకు తెచ్చి ఇండ్లకు పంపించారు. ముంపు ప్రాంతాలను కలెక్టర్, ఆర్డీవో వేణుమాధవరావు పరిశీలించారు. కేజీబీవీ ఎదుట విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి పీడీఎస్‌యూ బీసీ జేఏసీ నాయకులు ధర్నా నిర్వహించారు. సమస్య పరిష్కరించకుంటే పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. జాజిరెడ్డిగూడెం బ్రిడ్జి వద్ద మూసి పరవళ్లు తొక్కుతుంది. మండల వ్యాప్తంగా చెరువులు, కుంటలు అలుగు పోస్తున్నాయి.