చేర్యాల, జూలై 18 : సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంతో పాటు మండలంలోని వివిధ గ్రామాల్లో శుక్రవారం భారీ వర్షం కురిసింది. సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభమైన వర్షం 45 నిమిషాల పాటు జోరుగా పడింది. వర్షం కోసం అన్ని వర్గాలు ఎదురుచూస్తున్న సమయంలో ఎట్టకేలకు పడటంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. పట్టణంలో జాతీయ రహదారిని ఆనుకుని నిర్మించిన పెద్ద డ్రైనేజీకి కాంట్రాక్టర్ సరైన రంద్రాలు ఏర్పాటు చేయలేదు.
దీంతో రోడ్డుపైనే వర్షపు నీరు నిలిచిపోవడంతో వ్యాపార, వాణిజ్యవర్గాల వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.హైవేస్ అథారిటీ ఆఫ్ తెలంగాణ అధికారులు చేర్యాలలో కొనసాగుతున్న జాతీయ రహదారి 365(బి) నిర్మాణ పనులపై శ్రద్ధ చూపించకపోవడంతో కాంట్రాక్టర్ ఇష్టారాజ్యాంగా పనులు కొనసాగిస్తున్నాడని పలువురు విమర్శించారు. సంబంధితశాఖ అధికారులు ప్రత్యేక విచారణ చేపట్టి జాతీ య రోడ్డు పై వర్షపునీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.
ఝరాసంగం, జూలై 18 : సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలో భారీ వర్షం పడింది. ప్యారవరం గ్రామ సమీపంలోని వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాగుపై బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరైనా పనులు ప్రారంభించకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి ప్రత్యామ్నాయ మార్గాలు చూపుతూ బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
మనూరు, జూలై 18: సంగారెడ్డి జిల్లా మనూరు మండలంలోని మోస్త్తరు వర్షం కురిసింది. కొన్ని రోజులుగా రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. వర్షాల కోసం పలు గ్రామాల ప్రజలు పాదయాత్రగా వెళ్లి ఆలయాల్లో పూజలు నిర్వహించారు. శుక్రవారం కురిసిన వర్షంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.
జహీరాబాద్, జూలై 18 : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో మోస్త్తరు వర్షం కురిసింది. శుక్రవారం సాయంత్ర నుంచే జహీరాబాద్ నియోజకవర్గంలోని ఆయా మండలాల పరిధిలోని గ్రామాల్లో మేఘాలు కమ్ముకుని వర్షం పడటంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా సరైన వర్షాలు లేక భూముల్లో నాటిన పత్తి, కంది, సోయాబీన్, మినుము,పెసర మొక్కలు ఎండిపోయేదశకు చేరుకోవడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. ఈ క్రమంలో ఆయా మండలాల్లో కురిసిన వర్షం పంటలకు మళ్లీ జీవం పోసింది.