మనూరు, ఏప్రిల్ 10: సంగారెడ్డి జిల్లా మనూరు మండలంలో గురువారం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటుచేసుకుని వర్షం కురిసింది. వర్షంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. డోవూర్ గ్రామ శివారులో పిడుగుపడి రైతు బోజిరెడ్డి గేదె మృతి చెందింది.
నిజాంపేట్, ఏప్రిల్ 10: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని నిజాంపేట్తో పాటు నాగదార్, బాచెపల్లి, రాంరెడ్డిపేట్, పలు గ్రామాల్లో గురువారం వడగండ్ల వాన కురిసింది. పలుచోట్ల ఈదురుగాలులకు చెట్లు విరిగిపడ్డాయి. నిజాంపేట్లో పలువురు రేకుల ఇండ్లు, కార్పెంటర్ షాపుపై, బాచేపల్లిలోని మహాత్మాజోతిరావు పూలే పాఠశాలపై పైకప్పులు రేకులి ఎగిరిపోయాయి. పలు పంటలకు నష్టం వాటిల్లింది.
జహీరాబాద్, ఏప్రిల్ 10 : జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్కల్, ఝరాసంగం, మొగుడంపల్లి మండలాల్లో గురువారం సాయంత్రం ఈదురుగాలులతో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో జహీరాబాద్-బీదర్, అల్లాదుర్గం-మెటల్కుంట తదితర ప్రధాన రహదారులకు ఇరువైపులా పలుచోట్ల చెట్లు విరిగి రోడ్లపై పడ్డాయి. పలు గ్రామాల్లో ఇండ్లపై ఉన్న రేకులు గాలికి ఎగిరిపోయాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగి నేలపై పడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. మామిడి కాయలు నేలపాలయ్యాయి. కూరగాయలు, జొన్న, పత్తి పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది.
నాగల్గిద్ద, ఏప్రిల్ 10: సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండలంలో గ్రామంలో గురువారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులో కూడిన వర్షం కురిసింది. పలుచోట్ల ఈదురు గాలులకు మామిడి కాయలు నేలరాలాయి. పలు గ్రామాల్లో ఇండ్లపై రేకులు ఎగిరిపడ్డాయి. జొన్న రైతులకు నష్టం వాటిల్లింది.
సదాశివపేట/కొండాపూర్: సదాశివపేట పట్టణ పరిధిలోని సిద్దాపూర్ శివారులో గురువారం సాయంత్రం పిడుగుపాటుకు విద్యార్థి మృతిచెందాడు. కొండాపూర్ మండలలం గంగారం గ్రామానికి చెందిన సంతోష్, అన్వేష్ సదాశివపేట పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఐటీఐ చదువుతున్నారు. గురువారం సాయంత్రం కళాశాల నుంచి తిరిగి గంగారం గ్రామానికి బైక్పై వెళ్తుండగా మార్గమధ్యలో భారీ వర్షం పడడంతో చెట్టుకిందకు వెళ్లారు. చెట్టుపై పిడుగు పడడంతో సంతోష్(17) అక్కడికక్కడే మృతిచెందాడు. అన్వేష్కు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స నిమిత్తం సంగారెడ్డి దవాఖానకు తరలించారు.
నారాయణఖేడ్, ఏప్రిల్ 10: నారాయణఖేడ్తో పాటు మండలంలోని పలు గ్రామాల్లో గురువారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురు గాలులు వీయడంతో పట్టణంలోని రాయిపల్లి రోడ్డులో గల ఓ రెస్టారెంట్ పైకప్పు పెంకులు పూర్తిగా ఎగిరిపోగా ఆ సమయంలో రెస్టారెంట్లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పట్టణంలోని మార్వాడీ గల్లీలో వర్షపునీరు వీధుల గుండా ప్రవహిస్తూ ఇండ్లల్లోకి చేరడంతో స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు. చాప్టా(కె)లో ఈదురు గాలుల కారణంగా ఓ ఇంటి పైకప్పు రేకులు లేచిపోగా రెండు విద్యుత్ స్థంభాలు విరిగిపోయాయి. మామిడికాయలు నేలరాలాయి.