నారాయణఖేడ్, అక్టోబర్ 6: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో వాన దంచికొట్టింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. డివిజన్ పరిధిలోని కంగ్టిలో అత్యధికంగా 125 మిల్లీమీటర్లు, మనూరులో అత్యల్పంగా 52 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా నిజాంపేట్‌లో 110 మిల్లీమీటర్లు, సిర్గాపూర్‌లో 104 మిల్లీమీటర్లు, నాగల్గిద్దలో 92 మిల్లీమీటర్లు, నారాయణఖేడ్‌లో 75 మిల్లీమీటర్లు, కల్హేర్‌లో 73 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
అన్ని మండలాల్లో పెద్ద ఎత్తున వరి, పత్తి తదితర పంటలు నీటమునిగాయి. భారీ వర్షం కారణంగా పలు రోడ్లపై నుంచి వరద పొంగి ప్రవహించడంతో గంటల తరబడి రాకపోకలు స్తంభించాయి. నారాయణఖేడ్ పట్టణ శివారులోని మన్సూర్పూర్ వాగు రోడ్డుపై నుంచి ప్రవహించడంతో సుమారు నాలుగు గంటల పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో కంగ్టి, పిట్లం రూట్లలో వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సిర్గాపూర్ మండలం వాసర్ ఊరవాగు రోడ్డుపై నుంచి పొంగిపొర్లడంతో వాసర్- కంగ్టి మధ్య, కంగ్టి మండలం బాన్సువాడ(డి) వద్ద వంతెనపై నుంచి కాకివాగు ప్రవహించడంతో నారాయణఖేడ్- తడ్కల్ మధ్య రాకపోకలు స్తంభించాయి.
కల్హేర్ మండలంలో కల్హేర్, కామారెడ్డి జిల్లా పిట్లం మధ్య వంతెనపై నుంచి మహారాజు వాగు ఉధృతంగా ప్రవహించగా కల్హేర్- మాసన్పల్లి, బాచేపల్లి- మీర్ఘాన్పేట్, కల్హేర్- మార్డి గ్రామాల మధ్య ఉన్న పలు వాగులు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. చెరువులు, కుంటలు, వాగుల్లో భారీగా వరద చేరి పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలను ముంచెత్తాయి. నారాయణఖేడ్ పట్టణంలోని దత్తాత్రేయకాలనీ, భూమయ్యకాలనీ, ఏఎస్‌నగర్ కాలనీలు జలమయం కావడంతో మధ్యాహ్నం వరకు జనజీవనం స్తంభించింది.