మెదక్ మున్సిపాలిటీ/సిద్దిపేట కలెక్టరేట్/వెల్దుర్తి/రామాయం పేట ఆగస్టు 16: మెదక్లో శుక్రవారం సాయంత్రం గంటన్నర పాటు భారీ వర్షం కురవడంతో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. ప్రధాన రహదారులపైకి వర్షంనీరు రావడంతో పాత బస్టాండ్, రాందాస్ చౌరస్తాతోపాటు జేఎన్ రోడ్డు, ఆటోనగర్ రోడ్లు జలమయమయ్యాయి. సుమారు అరగంట పాటు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. వర్షాకాలంలో ఇప్పటివరకు ఇదే అతిపెద్ద వర్షం కావడం విశేషం. మున్సిపల్ డ్రైనేజీలు శుభ్రం చేయకపోవడంతో డ్రైనేజీల నుంచి నీరు రోడ్లపైకి వచ్చి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సిద్దిపేట జిల్లాలో ఎడతెరుపు లేకుండా వర్షం కురుసింది. భారీ వర్షానికి వాగులు, కుంటలు నిండాయి. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. భారీ వర్షం కురవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. పంటలకు జీవంపోసినట్లు అయిందన్నారు.
వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్లో భారీ వర్షం కురిసింది. గంటకుపైగా కురిసిన వర్షంతో దిగాలుగా ఉన్న రైతన్నల్లో సంతోషం వెల్లివిరిసింది. సాగు నీటి ఇబ్బందులతో సతమతమవుతున్న అన్నదాతలకు ఊరటనిచ్చింది. ఇప్పటికే బోరుబావుల్లో నీటి నిల్వలు తగ్గుముఖం పట్టగా, సాగు చేసిన పంట చేతికి వస్తుందా అని రైతులు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం కురిసిన వర్షంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. రామాయంపేట, చేగుంట, తూప్రాన్లోనూ వర్షం కురిసింది.