మెదక్: ఉమ్మడి మెదక్ జిల్లాలో (Medak) వర్షం దంచికొట్టింది. భారీ వరదలో జనజీవనం అతలాకుతలమైంది. పలు చోట్ల వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రోడ్లు కొట్టుకుపోవడంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలు, వరదలో పలు ప్రాంతాల్లో పంటలు నీటమునిగాయి. హల్దీ ప్రాజెక్టు ఉధృతితో కుప్పులపల్లి, హకీంపేట మధ్య నిలిచిన రాకపోకలు. టేక్మాల్ మండలం బోడ్మట్పల్లి వద్ద పొంగుతున్న పెద్దవాగు. దీంతో బోడ్మట్పల్లి-మెదక్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. టేక్మాల్ మండలం దన్నురా వద్ద చెరువకట్టపై వరదతో నిలిచిన రాకపోకలు.అల్లాదుర్గంలో ఒట్టికుంట చెరువు కట్ట తెగడంతో పొలాల్లోకి వరద. సుమారు 200 ఎకరాల్లో పంట నీటమునిగింది. నీలకంటిపల్లి, అల్లాదుర్గం రోడ్డు కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఉసిరికపల్లి, గూడూరు, గంగయ్యపల్లి, గుండ్లపల్లి చెరువులు జలకళను సంతరించుకున్నాయి. దీంతో వాగులు, అలుగులు పొంగుతున్నాయి.
శివ్వంపేట మండలం పాంబండ వద్ద భారీ వరదకు నూతనంగా నిర్మించిన డబుల్ రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో ఉసిరికపల్లి, వెల్దుర్తి మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోతులబొగుడ వద్ద కల్వర్టు తెగడంతో రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో వాహనాలు నిలిచిపోయాయి. బిజిలీపూర్ వాగు ఉధృతితో గంగాయిపల్లి-బిజిలీపూర్ మధ్య రాకపోకలు బందయ్యాయి. నర్సాపూర్ మండలం ఖాజీపేటలో మోతుకు కుంటకు మరోసారి గండిపడింది. రెండు రోజుల క్రితం గండిపడటంతో రెవెన్యూ సిబ్బంది, నీటిపారుదల అధికారులు మరమ్మతులు చేశారు. అయితే తాజాగా పడిన వర్షానికి మరోసారి అదేచోట గండపడటంతో నీరు వృథాగా పోతున్నది.
ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయింది. సిద్దిపేట జిల్లా గౌరారంలో అత్యధికంగా 23.5 సెం.మీ. వర్షపాతం నమోదయింది. ములుగులో 18.6, బేగంపేటలో 16.2, అంగడి కిష్టాపూర్‌లో 14.1, ఇస్లాంపూర్‌లో 17.8, కౌడిపల్లిలో 17.2, చిన్నశంకరంపేటలో 16.4, దామరంచలో 15.8, మాసాయిపేటలో 14.8, కంగ్టిలో 16.6, కల్హేర్ 11.9, కడ్పాల్ 10.6, అన్నసాగర్లో 10.3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదయింది.