మెదక్, సెప్టెంబర్ 2(నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మెదక్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి మొదలైన వానలు ఆదివారం రాత్రి వరకు తెరిపివ్వలేదు. జిల్లావ్యాప్తంగా 707.3 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మెదక్‌లో 1010 మి.మీ వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా మనోహరాబాద్‌లో 511.6 మి.మీ వర్షపాతం కురిసింది. ఘనపూర్ ప్రాజెక్టుకు 10వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. అంతేనీరు అలుగుపై నుంచి దిగువన ప్రవహిస్తోంది.
పోచా రం ప్రాజెక్టుకు 30 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. జిల్లాలో 2694 చెరువులు ఉండగా, ఆదివారం సాయంత్రం వరకు 471 చెరువులు అలుగు పారుతున్నాయి. 25 నుంచి 50 శాతం వరకు 461 చెరువులు నిండగా, 931 చెరువులు 50 నుంచి 75శాతం వరకు నిం డాయి. 75 నుంచి 100 శాతం వరకు 831 చెరువుల్లోకి నీరు వచ్చింది. జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు 223 ఇండ్లు పాక్షికంగా కూలిపోయాయి. జిల్లాలో 165 ఎకరాల్లో వివిధ పంటలు నీటి మునిగాయి.
ఇందులో హవేళీఘనపూర్ మండలంలో 105, బూర్గుపల్లిలో 35, రాజ్‌పల్లిలో 25 ఎకరాల్లో పంటలు నీటమునిగాయని మెదక్ జిల్లా వ్యవసాయాధికారి గోవింద్ తెలిపారు. వాగులు పొంగి ప్రవహిస్తుండడంతో రాకపోకలు స్తంభించాయి. మెదక్ మండల సమీపంలోని మల్కాపూర్ స్కూల్ తండాకు వెళ్లే రోడ్డు పూర్తిగా కొట్టుకుపోవడంతో రెండు రోజులుగా గిరిజనుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మెదక్ మండలం తిమ్మానగర్ నుంచి రామాయంపేటకు వెళ్లే దారి కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
హవేళీఘనపూర్ మండలం దూప్సింగ్తండా వద్ద బ్రిడ్జి కుంగిపోవడంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. భారీ వర్షాల నేపథ్యం లో మెదక్ కలెక్టరేట్లో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ రాహుల్‌రాజ్ తెలిపారు. విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు యం త్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ సెల్: 9391942254 నంబర్‌కు ఫోన్ చేయాలని కోరారు. కంట్రోల్ రూమ్ 24 గం టలపాటు పనిచేస్తుందని పేర్కొన్నారు. కంట్రోల్ రూమ్ ద్వారా సమాచారం సేకరణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు.