చేర్యాల, ఏప్రిల్ 10: మండలంలోని ఆకునూరు, ముస్త్యాల, రాంపూర్ గ్రామా ల్లో గురువారం వడగండ్ల వాన కురవడంతో 200 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. గురువారం వేకువజామున అరగంట పాటు చిన్నపాటిగా కురిసిన వడగండ్ల వానతో చేతికివచ్చిన వడ్లు రాలిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆకునూరులోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలోని వడ్లు తడిసిపోయాయి. రైతులు ఉదయాన్నే కేంద్రం వద్దకు వెళ్లి వడ్లను ఆరబోసుకున్నారు.
ముస్త్యాలలో రైతు కేసిరెడ్డి సురేందర్‌రెడ్డికి చెందిన లక్షన్నర రూపాయల విలువైన జెర్సీ అవు పిడుగుపాటుతో మృతిచెందింది. గ్రామ మాజీ సర్పంచ్ పెడుతల ఎల్లారెడ్డి ఎమ్మెల్యే దృష్టికి విషయాన్ని తీసుకుపోవడంతో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి రైతు కేసిరెడ్డి సురేందర్‌రెడ్డి కుమారుడు శ్రీకాంత్‌రెడ్డితో ఫోన్లో పరామర్శించారు. ప్రభుత్వం నుంచి సాయం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వడగండ్ల వానకు పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని, ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందించేందుకు తాను కృషిచేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. అధికారులు గ్రామాల్లో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించాలని ఎమ్మెల్యే పల్లా ఆదేశించారు.