మెదక్, జూలై 29 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు ప్రవహిస్తున్నాయి. వనదుర్గ ప్రాజెక్టు (ఘనపూర్ ప్రాజెక్టు)లోకి భారీగా నీరు రావడంతో కట్టపై నుంచి వరద ప్రవహిస్తుంది. మెదక్, హవేళిఘనపూర్ మండలాల్లోని పలు వాగులు ప్రవహిస్తున్నాయి.
హవేళిఘనఫూర్ మండలంలోని దూప్సింగ్తండాకు వెళ్లే రోడ్డుపై వరద ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గత ఏడాది భారీ వర్షం పడటంతో తండా కు వెళ్లే రోడ్డుపై ఉన్న కల్వర్టు కూలిపోవడంతో కొత్తగా బ్రిడ్జి నిర్మిస్తున్నారు. బ్రిడ్జి పనులు అసంపూర్తిగా ఉండడం తో భారీ వర్షానికి నీరు రోడ్డు పై ప్రవహించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రెండు రోజులుగా మెదక్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడటంతో చెరువులు, చెక్‌డ్యామ్‌లు కళకళలాడుతున్నాయి. బుధవారం రాత్రి శంకరంపేట(ఏ)లో 36.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రేగోడ్‌లో 18.3, టేక్మాల్‌లో 27.4, పాపన్నపేటలో 50.4, హవేళీఘనఫూర్లో 47.4, రామాయంపేటలో 44.0 , నిజాంపేటలో 41.2, అల్లాదుర్గాలో 18.6, చేగుంటలో 51.2, నార్సింగ్‌లో 43.2, శంకరంపేట(ఆర్) 43.5, మెదక్‌లో 38.6, కొల్చారంలో 50.4, చిలిపిచెడ్‌లో 11.4, కౌడిపల్లిలో 20.5, నర్సాపూర్‌లో 16.5, శివంపేటలో 12.8, వెల్దుర్తిలో 50.2, తూప్రాన్‌లో 29.6, మనోహరాబాద్‌లో 9.0, మాసాయిపేటలో 38.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.